కృష్ణాలో మోగుతున్న డేంజర్ బెల్స్
కృష్ణ జిల్లాలో ఒక్కసారిగా 23 కేసులు పెరగడంతో జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. హై అలర్ట్ జోన్‌గా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలను ప్రకటించారు.

ఏపీలో క్షణక్షణం కరోనా కౌంట్ పెరిగిపోతోంది. గంటగంటకు కరోనా కల్లోలం ఉదృతరూపం దాల్చుతోంది. ఒక జిల్లాను దాటుకుని మరో జిల్లా పాజిటివ్ కేసులతో పరుగులు తీస్తోంది. ఒకసారి గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదు కాగా, ఆ వెంటనే నెల్లూరు, కడప, తూర్పుగోదావరి, ఇలా అక్కడ ఇక్కడా అనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పాజిటివ్ రేటింగ్‌లో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీ మొత్తంలో కృష్ణా జిల్లాలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కృష్ణ జిల్లాలో ఒక్కసారిగా 23 కేసులు పెరగడంతో జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. హై అలర్ట్ జోన్‌గా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలను ప్రకటించారు. ఒక్క విజయవాడలోనే కరోనా పాజిటివ్ కేసులు 18కి చేరుకున్నాయి. జగ్గయ్యపేటలో 2, నూజివీడు 2, నందిగామలో ఒక కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పల్లెలో సైతం కట్టడి పెరుగుతోంది. గ్రామాల్లోకి ఎవరూ రాకుండా గ్రామస్తులు రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామాల్లోకి ఎవరూ రాకుండా స్థానికులు రాళ్లు అడ్డుపెట్టారు. గ్రామస్తులకు కూడా నిర్దేశించిన టైంలో మాత్రమే గ్రామాల్లోకి అనుమతిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.