Karnataka Medico Students: ఫ్రెషర్స్ పార్టీ తెచ్చిన తంట.. కరోనా బారిన పడ్డ 66 మంది మెడికల్ కాలేజ్ విద్యార్థులు!
కర్ణాటకలోని ధార్వాడ్‌లో దాదాపు 66 మంది వైద్య విద్యార్థులకు కరోనా వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ వ్యాక్సిన్లు వేయించుకున్నప్పటికీ వీరికి పాజిటివ్ నిర్ధారణ కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
Karnataka Medical Students Covid 19: కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష. ప్రభుత్వాలు పదే పదే ఈ విషయాన్ని చెబుతున్నాయి. ప్రజలంతా మాస్క్‌లు ధరించి.. భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు డోసులు వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేసింది. అయినప్పటికీ కొత్తగా కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలో కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
కర్ణాటకలోని ధార్వాడ్‌లో దాదాపు 66 మంది వైద్య విద్యార్థులకు కరోనా వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ వ్యాక్సిన్లు వేయించుకున్నప్పటికీ వీరికి పాజిటివ్ నిర్ధారణ కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్‌డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఇటీవల ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో 300 మంది మొదటి సంవత్సరం విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించుకోగా, 66 మందికి పాజిటివ్‌గా నిర్ధారణయింది. ఈ మేరకు మెడికల్ కాలేజీ యాజమాన్యం వెల్లడించింది.
మరోవైపు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కళాశాలలోని రెండు హాస్టళ్లను ముందుజాగ్రత్త చర్యగా మూసివేశారు. ప్రస్తుతం ఫిజికల్ క్లాసులు నిలిపివేసినట్లు మెడికల్ కాలేజ్ అధికారులు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్నప్పటికీ విద్యార్థులు కరోనా బారిన పడ్డారని, వారికి హాస్టల్‌లోనే చికిత్స చేయిస్తామని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితీష్ పాటిల్ తెలిపారు. ‘ముందు జాగ్రత్తగా విద్యార్థులను క్వారంటైన్ చేసి, రెండు హాస్టళ్లను మూసివేశామని తెలిపారు. విద్యార్థులకు వైద్యం, ఆహారం అందిస్తామని, హాస్టళ్ల నుంచి వారిని ఎవరూ బయటకు రానివ్వడంలేదన్నారు. పరీక్షల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను కూడా ఇదే ప్రాంగణంలో ఉంచుతాం. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నితీష్ పాటిల్ చెప్పారు.
ఫ్రెషర్స్ పార్టీ కారణంగా విద్యార్థులు కరోనా బారిన పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ‘విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వెళ్లారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులందరికీ కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించాం. వీరిని కలిసిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తాం. విద్యార్థులందరూ రెండు డోసుల టీకాలు తీసుకున్నార’ని నితీష్ పాటిల్ వెల్లడించారు. కాగా, వ్యాధి సోకిన కొంతమంది విద్యార్థులకు దగ్గు, జ్వరం ఉండగా మరికొందరికి ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవన్నారు.
More than 60 students of a medical college in Karnataka’s Dharwad have tested positive for #Covid19, said district collector #NitishPatil. pic.twitter.com/XDTIaojxxs
— IndiaObservers (@IndiaObservers) November 25, 2021
Read Also… Two Heads Baby: అప్పుడే పుట్టిన బిడ్డను వదిలి పారిపోయిన తల్లిదండ్రులు.. అసలు కారణం తెలిస్తే షాక్!