కరోనాతో మృతిచెందిన వైద్యుడికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా
కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలో మృతిచెందిన సీనియర్ డాక్టర్ కుటుంబానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సానుభూతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వైద్యుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా..
కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలో మృతిచెందిన సీనియర్ డాక్టర్ కుటుంబానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సానుభూతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వైద్యుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు తెలిపారు. డాక్టర్ జీవితానికి వెలకట్టలేమని, ఇది కేవలం గౌరవ వేతనంగా సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. సోమవారం (జూన్ 29) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్‌గా సేవలందించిన ఓ యోధుడిని కోల్పోయామంటూ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న లోక్ నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ అసీమ్ గుప్తా కొవిడ్ రోగులకు విశేష సేవలు అందించారు. ఈ క్రమంలో జూన్ 6న ఆయన కూడా వైరస్ బారినపడ్డారు. తొలుత స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. అనంతరం అనారోగ్య లక్షణాలు తీవ్రం కావడంతో లోక్ నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన విజ్ఞప్తి మేరకు సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో మ్యాక్స్ ఆస్పత్రిలో ఆదివారం డాక్టర్ అసీమ్ గుప్తా కన్నుమూశారు. ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్యురాలైన ఆయన సతీమణి కూడా వైరస్ బారినపడి కోలుకున్నట్లు తెలిపారు.