చుక్క‌లేక‌…చిక్కులు..మందుబాబుల‌కు క‌రోనా క‌ష్టాలు

లాక్‌డౌన్‌ నేప‌థ్యంలో అన్ని వ్య‌వ‌స్థ‌లు స్తంభించిపోయాయి. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా వల్ల మందుబాబులకూ పెద్ద కష్టం వచ్చి పడింది. చుక్క‌లేక, కిక్కేదొర‌క్క మందుబాబుల క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతంగా మారాయి....

  • Jyothi Gadda
  • Publish Date - 3:55 pm, Sat, 28 March 20
చుక్క‌లేక‌...చిక్కులు..మందుబాబుల‌కు క‌రోనా క‌ష్టాలు

ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించి వేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేప‌థ్యంలో అన్ని వ్య‌వ‌స్థ‌లు స్తంభించిపోయాయి. దేశాల సరిహద్దులు మూసివేశారు. రోడ్లు, పబ్లిక్ ప్రదేశాలల్లో ఎవరినీ తిరగనియ్యడం లేదు. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే కరోనా వల్ల మందుబాబులకూ పెద్ద కష్టం వచ్చి పడింది. చుక్క‌లేక, కిక్కేదొర‌క్క మందుబాబుల క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతంగా మారాయి….

లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు కూడా మూత‌ప‌డ్డాయి. మందు బాబులు విలవిలలాడిపోతున్నారు. దీందో కొంద‌రు మందుబాబులు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. చుక్క పడందే రోజు గ‌డ‌వ‌ని వారికైతే లాక్ డౌన్ శాపంగా మారింది. ధైర్యం చేసి బయటకు వెళితే పోలీసులు బడితె పూజ చేయడంతో మందుబాబులకు అర్థం కావడంలేదు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో కొంద‌రు మందుబాబులు పిచ్చిపిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే…

లాక్‌డౌన్ నేప‌థ్యంలో నిజామాబాద్ జిల్లాలో మ‌ద్యం దుకాణాన్ని మూసివేశారు. ఎక్క‌డా చుక్క మందు దొర‌క‌టం లేదు. చివ‌ర‌కు క‌ల్లు కూడా క‌రువైంది. దీంతో మ‌ద్యం ప్రియులు ఆందోళనకు గురవుతున్నారు. కల్లు దుకాణాలు మూతపడటంతో కొంద‌రు క‌ల్తీ క‌ల్లు త‌యారు చేసి అమ్ముతున్నారు. అలా త‌యారు చేసిన క‌ల్తీ కల్లు తాగిన వారంతా మతి స్థిమితం తప్పి ప్రవర్తిస్తున్నారు. దీంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు … వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇటీవ‌లే నిజామాబాద్ ప‌ట్ట‌ణంలో ఓ వ్య‌క్తి తాగుడు లేక‌పోవ‌డంతో పిట్స్‌ వచ్చి మృతి చెందిన‌ట్లుగా స్థానికులు చెబుతున్నారు.

ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మందుబాబులు ఏకంగా వైన్‌ షాపుకే కన్నం వేశారు. చేతికి అందినన్ని మందు బాటిల్స్‌ను ఎత్తుకెళ్లారు.. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెంలోని శ్రీ సాయి వైన్స్‌లో ఆగంతకులు షాపు షట్టర్స్‌ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న సివిల్‌, ఎక్సైజ్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, విచారణ చేపట్టారు.

ఇదిలా ఉంటే, అటు కేర‌ళలోనూ మ‌రో విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. కేర‌ళ రాష్ట్రం త్రిసూర్‌ జిల్లాకు చెందిన సనోజ్ వ్య‌క్తి మ‌ద్యానికి బానిస‌గా మారాడు. లాక్‌డౌన్ కార‌ణంగా గత వారం రోజుల నుంచి మద్యం లేకపోయే సరికి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన‌ట్లుగా కేర‌ళ పోలీసులు వెల్ల‌డించారు. తాగుడు అల‌వాటుగా ఉన్న‌మ‌రి కొంద‌రు మందు పడక నరాలు జివ్వుమని లాగుతుండటంతో ఏం చేయాలో అర్థం కాక డీఅడిక్షన్‌ సెంటర్‌లో చేరుతున్నారు. మందుబాబులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి.. వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.