Covid-19 Vaccination: దేశవ్యాప్తంగా వేగం పుంజుకున్న వ్యాక్సినేషన్.. 20 కోట్లకు చేరవగా టీకాల పంపిణీ
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ యజ్ఞంలా సాగుతోంది. మొన్నటి వరకు కాస్తా నెమ్మదించిన ప్రక్రియ మళ్లీ పరుగులు పెడుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ఎంతో ఊరట కల్గిస్తోంది.
India Covid Vaccination: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ యజ్ఞంలా సాగుతోంది. మొన్నటి వరకు కాస్తా నెమ్మదించిన ప్రక్రియ మళ్లీ పరుగులు పెడుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ఎంతో ఊరట కల్గిస్తోంది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం…
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 19 కోట్ల 75 లక్షల 31 వేల 598 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 15 కోట్ల 53 లక్షల 58 వేల 554 మందికి మొదటి డోస్ అందగా.. 4 కోట్ల 21 లక్షల 73 వేల 44 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 8 లక్షల 76 వేల 576 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
ఇటు తెలుగు రాష్ట్రాల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్ ప్రక్రియ షురూ అయ్యింది. తెలంగాణలో మళ్లీ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 56 లక్షల 29 వేల 664 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్ పూర్తైన వారు 44 లక్షల 70 వేల 524 మంది. రెండో డోస్ పూర్తైన వారు 11 లక్షల 59 వేల 140 మంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 1,047 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఏపీలో ఇప్పటి వరకు 83 లక్షల 17 వేల 51 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 59 లక్షల 37 వేల 392 మందికి మొదటి డోస్ అందగా.. 23 లక్షల 79 వేల 659 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది.
మరోవైపు, 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు వారికి ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్రం. ముందస్తు నమోదు లేకుండా.. టీకా కేంద్రాల దగ్గర అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వ్యాక్సిన్ వృథాను తగ్గించేందుకే ఈ నిర్ణయమని కేంద్రం ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలు చూస్తే.. 23 కోట్ల 32 లక్షల 25 వేల 565 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 8 కోట్ల 89 లక్షల 79 వేల 470 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 14 కోట్ల 42 లక్షల 46 వేల 93 మంది 45 ఏళ్ల పైబడిన వారు.
అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి వ్యాక్సిన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? లేదంటే.. ఇప్పుడు కోవిన్ పోర్టల్‌ను ఓపెన్ చేయండి. పేర్లను నమోదు చేసుకోండి.. కరోనాకు దూరంగా ఉండండి.