Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super-cells to Antibodies: కరోనా వైరస్ తిక్క కుదిర్చే కణాలు ఇవేనట.. మహమ్మారిని అడ్డుకోవడంలో ‘‘టీ సెల్స్’’ క్రియాశీలకం..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారితో పోరాడాలంటే.. శరీరంలో యాంటీబాడీల కంటే T క‌ణాల ( T Cells ) పాత్రే కీల‌కం అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

Super-cells to Antibodies:  కరోనా వైరస్ తిక్క కుదిర్చే కణాలు ఇవేనట.. మహమ్మారిని అడ్డుకోవడంలో ‘‘టీ సెల్స్’’ క్రియాశీలకం..!
Covid Variants Can Evade Antibodies By Spreading Via Super Cells
Balaraju Goud
|

Updated on: Jun 14, 2021 | 3:59 PM

Share

Super-cells to Antibodies: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారితో పోరాడాలంటే.. శరీరంలో యాంటీబాడీల కంటే T క‌ణాల ( T Cells ) పాత్రే కీల‌కం అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. కరోనావైరస్‌కి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అహర్నిశలు ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే తాజాగా ప‌రిశోధ‌కులు తాము చేసిన అధ్యయనంలో ఈ విష‌యాన్ని కనుగొన్నట్టు తెలిపారు. కోవిడ్‌-19ని నియంత్రించాలంటే రోగ‌నిరోధ‌క శ‌క్తిలో భాగమైన T క‌ణాల పాత్రే కీలకంగా మారినట్టు ప‌రిశోధ‌కులు తేల్చిచెబుతున్నారు.

వైరస్‌ సోకడం లేదా టీకా పొందడం వల్ల మన శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు చాలా శక్తిమంతంగా ఉంటాయి. అయినా వైరస్‌లు తెలివిగా వీటి కళ్లుగప్పుతుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. మన రోగనిరోధక వ్యవస్థలోని T కణాలు.. ఇలాంటి ఎత్తులను చిత్తు చేస్తాయంటున్నారు. మానవ కణంలోకి ప్రవేశించిన వైరస్‌.. దాన్ని ఒక కర్మాగారంలా ఉపయోగించుకుంటూ స్వీయ ప్రతులను తయారు చేసుకుంటుంది. ఆ తర్వాత కణాన్ని నాశనం చేసి, కొత్త కణాల్లోకి చేరి.. అక్కడా ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తుంది. ఈ వైరస్‌ను అడ్డుకోవడంలో మన యాంటీబాడీలు పోరాడుతాయి. అవి వైరస్‌కు అతుక్కోవడం ద్వారా మన కణాల్లోకి వాటి ప్రవేశాన్ని నిలువరిస్తాయి. అయితే, పొరుగునున్న కణాలకు వ్యాప్తి చెందడం కోసం మొదటి కణం నుంచి వైరస్‌ బయటకు రాకుంటే పరిస్థితి ఏంటి? వాటిపై మన యాంటీబాడీలు సమర్థంగా పనిచేస్తాయా? ఈ అంశంపై శాస్త్రవేత్తలు తాజాగా పరిశోధనలు చేపట్టారు.

రక్తంలో ఉండే ఒక రకమైన తెల్ల రక్త కణాలనే ఈ T సెల్స్ లేదా T కణాలు అంటారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని సమన్వయపర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో యాంటీబాడీల‌తో పాటు T క‌ణాలు అధిక మోతాదులో ఉంటేనే వైర‌స్ తీవ్రతను త‌గ్గించే అవ‌కాశాలు ఉన్నాయని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు పరిశోధకులు పేర్కొన్నారు. కరోనావైరస్‌కి చెక్ పెట్టేందుకు తయారవుతున్న కోవిడ్-19 వ్యాక్సిన్స్ సైతం కరోనా వ్యాధిగ్రస్తుల శరీరంలో యాంటీబాడీలతో పాటు T సెల్స్ కూడా పెంపొందించే విధంగా ఉండాలని.. అప్పుడే కోవిడ్-19కి చెక్ పెట్టగలమని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ మేరకు తమ అధ్యయనం ఫలితాలకు సంబంధించిన నివేదికను సెల్ జ‌ర్నల్‌లో ప్రచురించారు. ఇన్‌ఫెక్షన్ అధికంగా ఉన్న వారిలో యాంటీబాడీల క‌ంటే.. టీ క‌ణాల ఆవశ్యకతే ఎక్కువ‌గా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

అత్యంత ఎక్కువ సంక్రమణ శక్తి కలిగిన కరోనా వైరస్‌.. మానవ కణాలనూ మార్చేస్తుంది. అది రెండు మూడు మానవ కణాలు ఒక్కటిగా కలిసిపోయేలా చేస్తుంది. ఇలా ఏర్పడిన ‘సూపర్‌ కణాలు’ భారీ వైరల్‌ ఫ్యాక్టరీలుగా తయారవుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి ద్వారా వైరస్‌ తన సంఖ్యను పెంచుకుంటుందని తేల్చారు. ఈ సూపర్‌ కణాలను ‘సిన్సీషియా’గా పేర్కొంటారు. వీటిలో అనేక కేంద్రకాలు (న్యూక్లియస్‌- కణంలో జన్యుపదార్థం కలిగి ఉండే భాగం), అధికంగా సైటోప్లాజమ్‌ (కేంద్రకం చుట్టూ జిగురులా ఉండే పదార్థం) ఉంటాయి. మరింత సమర్థంగా తన ప్రతులను పెంచుకోవడానికి వైరస్‌కు అవి తోడ్పడతాయి. అలాగే ఈ చర్య ద్వారా.. యాంటీబాడీల బారినపడకుండానే తన వనరులను వైరస్‌ పెంచేసుకుంటుంది. ఈ యాంటీబాడీలు కణాల వెలుపల మాత్రమే సంచరిస్తుంటాయి.

దక్షిణాఫ్రికాకు చెందిన అలెక్స్‌ సిగల్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కరోనా వైరస్‌లోని ఆల్ఫా, బీటా వేరియంట్లపై ప్రయోగాలు నిర్వహించింది. ఒక కణం నుంచి బయటకు రాకుండా.. నేరుగా మరో కణంలోకి ఇవి వ్యాప్తి చెందగలవని, తద్వారా యాంటీబాడీలను ఏమార్చగలవని గుర్తించారు. దీన్నిబట్టి.. ఒక కణంపై వైరస్‌ తన పట్టును బిగించి, పక్కనున్న కణాలకూ విస్తరిస్తే దాన్ని నిర్మూలించడం కష్టమని తేల్చారు. పరిణామక్రమంలో భాగంగా మన రోగనిరోధక వ్యవస్థ కంట్లో పడకుండా దాగి ఉండే కిటుకులను వైరస్‌లు వంటబట్టించుకున్నాయి. బయటకు రాకుండా కణం నుంచి కణానికి నేరుగా వ్యాప్తి చెందే వ్యూహం ఇందులో భాగమే.

ఈ విధానంలో కణాలను కలగలపాల్సిన అవసరం ఉండదు. యాంటీబాడీల నుంచి రక్షణ కోసం కణాల మధ్య ఉండే దృఢ బంధాన్ని వైరస్‌ తెలివిగా ఉపయోగించుకుంటుంది. అయితే, కణంలోకి ప్రవేశించకుండా వైరస్‌ను అడ్డుకోవడంలోనే యాంటీబాడీలు సమర్థంగా పనిచేస్తాయి. అప్పటికే ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డ కణాలపై మాత్రం వీటి సమర్థత కాస్త తక్కువగానే ఉంటుంది. దీన్నిబట్టి.. కణం నుంచి కణంలోకి నేరుగా పయనించే వైరస్‌లపై టీకాలు నిష్ప్రయోజనమవుతాయా అన్న ఆందోళన వ్యక్తంకావడం సహజం. అయితే, బహుళ పద్ధతుల్లో వైరస్‌లను ఎదుర్కొనే విధానాలను మన రోగనిరోధక వ్యవస్థ అలవర్చుకుందని శాస్త్రవేత్తలు తెలిపారు. T కణాలూ ఇందులో భాగమే. టీకా పొందినప్పుడు గానీ ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు గానీ అవి క్రియాశీలమవుతాయి. ఇన్‌ఫెక్షన్‌ సోకిన కణాలను గుర్తించి, వైరస్‌ను చంపేసేలా తయారవుతాయి. అందువల్ల వైరస్‌కున్న ‘కణం నుంచి కణానికి వ్యాప్తి’ సామర్థ్యం దీనిపై ప్రభావం చూపబోదు. T కణాలు మునుపటి ఇన్‌ఫెక్షన్‌ను గుర్తుపెట్టుకోగలవు. అదే వైరస్‌ మరోసారి దాడి చేస్తే వేగంగా స్పందించగలవని పరిశోధకులు చెబుతున్నారు.

Read Also….  Brahmamgari Matam: టీవీ సీరియల్ తలపిస్తున్న బ్రహ్మంగారి మఠాధిపతి వ్యవహారం.. మఠం పర్సన్‌ ఇన్‌ఛార్జిగా శంకర్‌ బాలాజీకి బాధ్యతలు