AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: మహారాష్ట్రలో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. తెలంగాణ సరిహద్దు జిల్లాలపై తీవ్ర ప్రభావం

మహారాష్ట్ర కరోనా పంజా విసురుతోంది. మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా... తెలంగాణ సరిహద్దు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Corona Virus: మహారాష్ట్రలో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. తెలంగాణ సరిహద్దు జిల్లాలపై తీవ్ర ప్రభావం
Maharashtra Virus Scare On Telangana Border
Balaraju Goud
|

Updated on: Apr 22, 2021 | 3:01 PM

Share

తెలంగాణ- మహారాష్ట్ర బోర్డర్‌లో.. కరోనా హైటెన్షన్‌ నెలకొంది. తెలంగాణ సరిహద్దులకు.. మహారాష్ట్ర కరోనా పంజా విసురుతోంది. మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా… తెలంగాణ సరిహద్దు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మహారాష్ట్ర నుంచి రాకపోకలు అధికంగా ఉండే నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో.. కరోనా కల్లోలం సృష్టిస్తోంది.

మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో రాకపోకలు సహజం..! అయితే కొద్దిరోజులుగా మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. సరిహద్దు జిల్లాల్లో వైరస్‌ విస్తరణ తీవ్రంగా ఉంది. నాందేడ్‌, యావత్‌మాల్‌, చంద్రాపూర్‌, గచ్చిరోలి నుంచి అక్కడి ప్రజలు నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలకు నిత్యం వచ్చి వెళ్తుంటారు. నాందేడ్‌ హైదరాబాద్‌కు కూడా భారీ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ముంబై నుంచి రైళ్లు కూడా నిజామాబాద్‌ మీదుగానే హైదరాబాద్‌కు నడుస్తున్నాయి. దీంతో.. కొవిడ్ ప్రభావం తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడుతోంది. సరిహద్దు జిల్లాల్లో కొద్ది రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని రహదారులపై సరైన చర్యలు కరవయ్యాయి. దానికితోడు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఎలాంటి నిఘా లేదు. బస్సులు, లారీలు, కార్లు, జీపులు, ద్విచక్రవాహనాలపై మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున జనం నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. తెలంగాణలోకి వైరస్‌ను చొప్పిస్తున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు పెద్దగా చర్యలు లేకపోవడంతో.. మహారాష్ట్రలో విజృంభించిన కరోనా వైరస్ మెల్లిగా తెలంగాణ వైపు మళ్లుతోంది.

మహారాష్ట్ర కరోనా ఎఫెక్ట్‌తోనే.. నిజామాబాద్‌ జిల్లాలో కేసులు, మరణాలు పెరుగుతున్నాయని అంటున్నారు మెడికల్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌ జలగం తిరుపతి రావు. వైరస్‌ను తేలికగా తీసుకోవడానికి లేదని.. చాలా ప్రమాదకరంగా విస్తరిస్తోందని.. జాగ్రత్తగా ఉండకపోతే.. తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు ప్రొఫెసర్‌ జలగం తిరుపతి రావు.

అటు.. నిర్మల్‌ జిల్లాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దీంతో.. కరోనా టెస్ట్‌ సెంటర్లకు అధిక సంఖ్యలో జనం క్యూ కడుతున్నారు. అయితే.. జిల్లాలో కరోనా టెస్ట్‌ కిట్ల కొరత నెలకొంది. సరిపడా టెస్ట్‌ కిట్లు లేకపోవడంతో.. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్‌లో టెస్ట్‌ కిట్ల కొరతతో.. ఒక్కో బాధితుడు నాలుగు రోజులు నిరీక్షిస్తే తప్ప టెస్టులు జరగడం లేదు.

Read Also…  విజయవాడ నగరంలో కరోనా రోగుల మృతదేహాలతో నిండిపోతున్న శ్మశానాలు, ఏపీ ప్రజల్లో భయాందోళనలు