Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.. ఒక్కరోజులో 7 లక్షలకు పైగా కేసులు.. అమెరికాలో లక్షకు పైగా..

ఇప్పటివరకు రెండు విడతలుగా విరుచుకుపడ్డ కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజుకో కొత్త రూపంలో విరుచుకుపడుతోంది.

Covid 19: మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి..  ఒక్కరోజులో 7 లక్షలకు పైగా కేసులు.. అమెరికాలో లక్షకు పైగా..
World Corona
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 07, 2021 | 10:10 AM

Covid 19 Global Outbreak: ఇప్పటివరకు రెండు విడతలుగా విరుచుకుపడ్డ కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజుకో కొత్త రూపంలో విరుచుకుపడుతోంది. అటు అగ్రరాజ్యం అమెరికాలో అనూహ్యంగా కొత్త పాజిటివ్ కేసులు పెరుగాయి. కోవిడ్ పుట్టినిల్లు చైనాలోనూ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దాదాపు రెండున్నర నెలల్లో ఎన్నడూ లేనివిధంగా గురువారం ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. ‘వరల్డ్‌ మీటర్‌’ గణాంకాల ప్రకారం మే 14 తర్వాత ఇంత పెద్ద ఎత్తున కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రధానంగా వ్యాపించే శక్తి ఎక్కువగా ఉన్న కరోనా వైరస్‌ డెల్టా రకం 135 దేశాల్లో వ్యాప్తి చెందింది. బ్రెజిల్, రష్యా, బ్రిటన్, ఇరాన్‌ సహా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇండొనేసియాలో మరణాలు పెరుగుతున్నాయి.

అటు, అమెరికా మరోసారి కరోనా రాకాసి కోరలకు విలవిలలాడుతోంది. తొలి విడతలో కల్లోలం చూసిన అగ్రరాజ్యం.. గత 3 రోజులుగా లక్షకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి. డెల్టా రకం వ్యాప్తి పెరుగుతోంది. గత నెల రోజుల్లో ఆసుపత్రుల పాలవుతున్న బాధితుల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ)’ సమాచారం మేరకు ఈ సంఖ్య సగటును 12 వేల నుంచి 43 వేలకు పెరిగింది. దేశవ్యాప్తంగా గురువారం 24 గంటల్లో 1.20 లక్షల మందికి పైగా కొవిడ్‌ బారిన పడ్డారు. అత్యధికంగా ఫ్లోరిడాలో 20 వేలకు పైగా కొత్త కేసులు బయట పడగా.. టెక్సాస్, కాలిఫోర్నియాల్లో ఈ సంఖ్య 10 వేలు దాటింది. అమెరికాలో ఫిబ్రవరి రెండో వారం తర్వాత మళ్లీ ఈ వారంలోనే రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. ఆసుపత్రుల పాలవుతున్నవారిలో ఫ్లోరిడా, జార్జియా, లూసియానాల్లోనే 40% మంది ఉన్నారు.

కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలోనూ డెల్టా రకం కేసులు పెరుగుతున్నాయి. స్థానిక వ్యాప్తి ద్వారా శుక్రవారం 80 మంది కోవిడ్‌ బారిన పడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. వీటిలో 58 కేసులు జియాంగ్సు ప్రావిన్సులోని యాంగ్‌ఝౌ నగరంలోనే నమోదయ్యాయి. ఇక్కడ డెల్టా రకం వ్యాప్తి ఎక్కువగా ఉందని, మరో 6 ప్రావిన్సుల్లో మిగతా కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుంటే, చైనాలో గత ఏడాది కోవిడ్‌ అదుపులోకి వచ్చిన తర్వాత ఇటీవల మళ్లీ వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. తాజా ఉద్ధృతి నాన్‌జింగ్‌ విమానాశ్రయంలో కేసులు బయటపడటంతో కరోనా వ్యాప్తి తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈమేరకు కొద్ది రోజులుగా బయటపడిన కేసుల సంఖ్య 1,200 దాటింది. దీంతో చైనా ప్రభుత్వం మళ్లీ కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. నాన్‌జింగ్‌ సహా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు విధించింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడంతో పాటు, అన్ని రకాల ప్రయాణాలపై నిషేధం విధించింది.

ఇక, బ్రెజిల్‌ దేశంలోనూ రోజువారీ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గురువారం 24 గంటల్లో 40 వేల మందికి పైగా కొవిడ్‌ బారిన పడగా.. 1,086 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండొనేసియాలో 1,700 మందికి పైగా మృతి చెందారు. రోజువారీ కేసులు సగటున 35 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఇరాన్‌లోనూ ఒక్క రోజులో 38,674 కేసులు బయటపడ్డాయి. బ్రిటన్‌లో తాజాగా 30,215 మందికి కొవిడ్‌ సోకింది. రష్యా, టర్కీ, ఫ్రాన్స్, మెక్సికోల్లోనూ 20 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదయ్యాయి.