వైరస్ వణుకు: హైదరాబాద్‌ను చుట్టేసిన 69వేల మంది విదేశీ ప్రయాణికులు
కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌వాసులను మరో భయం పట్టుకుంది. కరోనా నేపథ్యంలోనే వివిధ దేశాల నుంచి నగరానికి వచ్చిన వారి సంఖ్య తెలిసి అందరికీ చెమటలు పడుతున్నాయి. విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రయాణికులు ‘ఐసోలేషన్’ ప్రక్రియను విస్మరించి ప్రజల్లో కలసిపోయినట్లుగా తెలుస్తోంది.

భారతదేశంలో కూడా కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. వేగంగా విస్తరిస్తోన్న వైరస్‌ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయినప్పటికీ దేశంలో విస్తరించిన కొవిడ్ – 19 మహమ్మారి పంజా విసురుతోంది. తెలంగాణలోనూ ప్రవేశించిన కరోనా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌వాసులను మరో భయం పట్టుకుంది. కరోనా నేపథ్యంలోనే వివిధ దేశాల నుంచి నగరానికి వచ్చిన వారి సంఖ్య తెలిసి అందరికీ చెమటలు పడుతున్నాయి. విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రయాణికులు ‘ఐసోలేషన్’ ప్రక్రియను విస్మరించి ప్రజల్లో కలసిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎప్పుడు ఏ మూల నుంచి ఏ ఉపద్రవం వచ్చి పడుతుందేమోనన్న ఆందోళన అధికార యంత్రాంగంలో నెలకొంది.
హైదరాబాద్..ఇదో మినీ ప్రపంచం..ఇక్కడ అన్ని దేశాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలు నివసిస్తుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి రోజుకు కొన్ని వందల సంఖ్యలో జనాలు ఇక్కడికి వస్తుంటారు. కాగా కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ఈ మార్చి నెలలోనే సుమారుగా 69 వేల మంది ప్రయాణికులు హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. కోవిడ్-19 ఉధృతమై వందలాదిగా కేసులు నమోదైన యూరప్‌లోని ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల నుంచి గడిచిన 10 రోజుల్లోనే 540 మంది నగరంలో ప్రవేశించారు. వీరిలో అతి కొద్ది మంది మాత్రమే ఐసోలేషన్ సెంటర్‌కు వెళ్లినట్లుగా అధికార లెక్కలు చెబుతున్నాయి.
అమెరికా, యూరప్ దేశాల నుంచి వచ్చిన వారే 40 వేల మంది ఉన్నారని, మలేసియా, సింగపూర్, దుబాయ్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాల నుంచి 20 వేల మందికి పైగా భారత్‌లో ప్రవేశించారని, వారంతా హైదరాబాద్‌కే వచ్చినట్లుగా సమాచారం. మార్చి 10 నుంచి అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికులను పరీక్షించడం మొదలైన తర్వాత కూడా ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ నుంచి వచ్చిన 540 మంది ప్రజల్లో కలసిపోయారనే వార్తలు మరింత కలవర పెడుతున్నాయి. కోవిడ్ ఉధృతంగా ఉన్న విషయాన్ని విస్మరించిన ఆ నాలుగు దేశాల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు వారంతా ఇతర దేశాల్లోకి ప్రవేశించగలిగారని ఎయిర్ పోర్టు వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఇదిలా భారత్‌లో ప్రేశించిన కరోనాను ఆదిలోనే కట్టడి చేయకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటలీ, ఇరాన్ దేశాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. వైరస్ నియంత్రణ విషయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్త ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న దేశాల నుంచి వేల సంఖ్యలో వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్‌కు తరలించని కారణంగా వచ్చే వారం, పది రోజుల్లో ఏం జరుగుతుందోనన్న ఆందోళనకు గురిచేస్తోందని సెంటర్ ఫర్ సెల్యూలర్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్త ఒకరు వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సరిపోవనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే 15 రోజుల పాటు లాక్‌డౌన్ కాకపోతే ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.