AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CORONA VACCINATION: సెకెండ్ వేవ్‌కు చెక్ వ్యాక్సినేషనే.. కానీ ఉత్పత్తి అంఛనాలు చూస్తే ఏనాటికి సాధ్యం?

దేశం యావత్తు కరోనా సెకెండ్ వేవ్ తాకిడితో అల్లాడుతోంది. విజృంభిస్తున్న కరోనా డబుల్ మ్యూటెంట్ వేరియంట్‌తో ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. ఉధృత స్థాయిలో వ్యాపిస్తున్న కరోనా వైరస్‌కు బ్రేక్ వేసేదెలా? కేంద్ర, రాష్ట్రాలకు ఇపుడిదే...

CORONA VACCINATION: సెకెండ్ వేవ్‌కు చెక్ వ్యాక్సినేషనే.. కానీ ఉత్పత్తి అంఛనాలు చూస్తే ఏనాటికి సాధ్యం?
India Map With Lockdown And Vaccines
Rajesh Sharma
|

Updated on: May 13, 2021 | 2:01 PM

Share

CORONA VACCINATION IN INDIA: దేశం యావత్తు కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) తాకిడితో అల్లాడుతోంది. విజృంభిస్తున్న కరోనా డబుల్ మ్యూటెంట్ వేరియంట్‌ (CORONA DOUBLE MUTANT)తో ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. ఉధృత స్థాయిలో వ్యాపిస్తున్న కరోనా వైరస్‌కు బ్రేక్ వేసేదెలా? కేంద్ర, రాష్ట్రాలకు ఇపుడిదే ప్రధాన సవాల్‌గా మారింది. కరోనా జాగ్రత్తలను మరింత శ్రద్ధగా పాటించడంతోపాటు.. వ్యాక్సినేషన్ (VACCINATIO) ప్రక్రియను వేగవంతం చేయడమే సెకెండ్ వేవ్ చైన్ బ్రేక్‌కు దారి తీస్తుందని పలువురు సూచిస్తున్నారు. దీనితో వైద్య నిపుణులు, వైద్య శాఖ అధికార వర్గాలు, పరిశోధనలు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు (SCIENTISTS), చివరికి ప్రభుత్వాధినేతలు ఏకీభవిస్తున్నారు.

అయితే లాక్ డౌన్లతో మే నెలాఖరు దాకా ప్రభుత్వాలు నెట్టుకు రావచ్చు గాక.. ఆ తర్వాత అయితే లాక్ డౌన్లు (LOCK DOWN) పొడిగిస్తే దేశం మరోసారి తీవ్ర ఆర్థిక సంక్షోభం (FINANCIAL CRISIS)లోకి పడిపోయే ప్రమాదం వుంది. ఈ క్రమంలోనే మే నెలాఖరులోగా సెకెండ్ వేవ్ కరోనా వ్యాప్తికి బ్రేక్ వేయడంతోపాటు.. వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) యోచిస్తోంది. అదే సమయంలో కరోనా సోకి ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు, బాధితులకు చికిత్స చేసేందుకు అవసరమైన మందులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. దానికితోడు కరోనా సెకెండ్ వేవ్‌తో అతలాకుతలం అవుతున్న భారత్‌ (BHARAT)కు చేయూతనందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. నిజానికి వ్యాక్సిన్ తయారు చేసిన తొలి రెండు నెలల్లో మనదేశం దాదాపు 84 దేశాలకు వ్యాక్సిన్ మైత్రి (VACCINE MAITRI) కింద వ్యాక్సిన్లను పంపిణీ చేసింది. దానికి ప్రపంచ దేశాలు మన దేశాన్ని అభినందించాయి కూడా. కానీ కొన్ని లొసుగులు, జనసాంద్రత అధికంగా వుండడంతో మహారాష్ట్ర (MAHARASHTRA), కేరళ (KERALA) రాష్ట్రాలలో మొదలైన కరోనా సెకెండ్ వేవ్ మ్యూటెంట్ వైరస్ వ్యాప్తి.. రెండు నెలలుగా దేశాన్ని ముంచేసింది.

ఈక్రమంలోనే ప్రపంచ దేశాలు మన దేశానికి చేయూతనందించేందుకు ముందుకొస్తున్నాయి. వైద్య పరికరాలు, వైద్య సహాయాన్ని పంపిస్తున్నాయి. ఇలా వచ్చిన పరికరాలను, వైద్య సామాగ్రిని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయిస్తోంది. ఇప్పటివరకు 9,284 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 7,033 ఆక్సిజన్ సిలిండర్లు, 19 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను, 5,933 వెంటిలేటర్లు, బిఐపీఎపి, సీపీఎపి యంత్రాలు, 3.44 లక్షల రెమెడిసివీర్ వైల్స్‌ను రాష్ట్రాలకు పంపిణీ చేసిన కేంద్రం పంపిణీ చేసింది. రాష్ట్రాల్లో వైద్య మౌలిక సదుపాయాలు పెంచడానికి వేగవంతమైన కస్టమ్స్ క్లియరెన్స్ ద్వారా వాయు, రోడ్డు మార్గాల ద్వారా రాష్ట్రాలకు వైద్య పరికరాలు అందజేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డా. హర్షవర్ధన్ వెల్లడించారు.

అయితే.. ఇదంతా కరోనా బాధితులను ఆదుకునేందుకు తోడ్పడుతుంది కానీ.. సెకెండ్ వేవ్‌కు బ్రేక్ వేసేదెలా? చైన్‌ని బద్దలు కొట్టేదెలా? ఇదిపుడు అందరి ముందున్న ప్రధానమైన ప్రశ్న. దానికి లాక్ డౌన్లు, కర్ఫ్యూలు ఎంతో కొంత దోహడపడినా.. అవి శాశ్వత పరిష్కారం మాత్రం కాబోవు. లాక్ డౌన్లు, కర్ఫ్యూలతో కొంత కాలం నెట్టుకురావచ్చు కానీ.. అంతిమంగా అవే పరిష్కారం మాత్రం కాబోవన్నది చాలా మంది అభిప్రాయం. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడమే కరోనా వైరస్ అంతానికి శాశ్వత పరిష్కారమన్నది నిర్వివాదాంశం. కరోనా వైరస్ మరోసారి మ్యూటెంట్ అయితే.. మూడో వేవ్ (THIRD WAVE) మరింత దారుణమైన పరిస్థితులను మనకు చూపించడం ఖాయం. థర్ద్ వేవ్ రాకుండా వుండేందుకు ప్రస్తుతం కరోనా నిబంధనలను కఠినంగా పాటించడం.. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడంతోపాటు వ్యాక్సిన్ విధిగా వేయించుకోవడం ప్రజల బాధ్యత. అయితే.. ప్రజలందరు వ్యాక్సిన్ వేయించుకుందామనుకున్నా.. అందుబాటులో తగినంత స్థాయిలో వ్యాక్సిన్లు లేకపోతే వారు మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. వ్యాక్సిన్ సెంటర్ల (VACCINE CENTERS) దగ్గర పెద్ద క్యూలు కడితే కరోనా వైరస్ వ్యాప్తికి దోహదం చేయడమే తప్ప మరో ప్రయోజనం వుండదు.

ఓసారి దేశీయంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ (SEERUM INSTITUTE), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ (BHARAT BIOTECH INTERNATIONAL) సంస్థలు తాజాగా వెల్లడించిన ఉత్పత్తి అంఛనాలను చూస్తే ఇప్పుడప్పుడే మనదేశ జనాభాకు సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు కనీసం మూడు నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఉత్పత్తి పెంచేందుకు ఈ రెండు సంస్థలు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నాయి. కానీ.. దేశ జనాభాకు సరిపడే స్థాయిలో ఉత్పత్తి పెరగాలంటే నెలల తరబడి సమయం పట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 2021 ఆగస్టు నాటికి తాము ఉత్పత్తి చేయబోయే వ్యాక్సిన్ ప్రణాళికలను రెండు సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి మే 13న సమర్పించాయి. దీని ప్రకారం చూస్తే.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆగస్టు నాటికి పది కోట్ల డోసుల కోవిషీల్డు (COVIE SHIELD) వ్యాక్సిన్ డోసులను తయారు చేస్తామని ప్రణాళికలో పేర్కొంది. భారత్ బయోటెక్ (BHARAT BIOTECH) అయితే.. 7.8 కోట్ల కోవాక్జిన్ (COVAXIN) డోసులను ఉత్పత్తి చేస్తామని తెలిపింది. ఈ లెక్కన రెండు సంస్థలు కలిపి ఆగస్టు నాటికి 17.8 కోట్ల డోసులను మాత్రమే ఉత్పత్తి చేయగలవన్నమాట.

దేశంలో ఇప్పటికే సుమారు 18 కోట్ల మందికి వ్యాక్సిన్ చేరినందున ఆగస్టు నాటికి మరో 18 కోట్ల మందికి ఈ రెండు వ్యాక్సిన్లు చేరతాయని అంఛనా వేయొచ్చు. అంటే.. దేశ జనాభాలో 36 కోట్ల మందికి కరోనావ్యాక్సిన్ చేరుతుందన్నమాట. అయితే.. రెండో డోసును కూడా కలుపుకుంటే.. ఈ సంఖ్య మళ్ళీ సగానికి పడిపోతుంది. ఇందువల్లనే దేశప్రజలందరికీ వచ్చే రెండు నెలల కాలంలో మొదటి డోసునైనా పూర్తి స్థాయిలో అందించాలని కేంద్రం భావిస్తోంది. ఈ కారణంగానే తొలి డోసుకు.. మలి డోసుకు మధ్య వ్యవధిని 6 నుంచి 8 వారాలకు పెంచాలని కేంద్రానికి సూచనలు అందాయి. 8 వారాలంటే రెండు నెలల కాలంలో అందరికీ తొలి డోసును పెద్ద ఎత్తున చేర్చాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. తొలి డోసు తీసుకున్న వారిలోను 80 శాతం ప్రతిబంధకాలు (యాంటి బాడీస్) డెవలప్ అవుతాయని పరిశోధకులు తేల్చారు. ఈక్రమంలో రెండు నెలల కాలంలో తొలి డోసును పెద్ద ఎత్తున అందించాలని తలపెట్టారు.

ఇదే సమయంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల రూపొందించిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ లాంటి వాటిని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడంతోపాటు.. ఆయా సంస్థలతో దేశీయంగా ఒప్పందాలు కుదుర్చుకున్న తయారీ సంస్థలకు ముడి పదార్థాలను వేగంగా పంపిణీ జరిగేలా చూడడంతోపాటు ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల ద్వారా అందించేందుకు కేంద్ర ఏర్పాట్లు చేస్తోంది. ఈ విదేశీ వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తే.. దేశంలో వ్యాక్సినేషన్ వేగం పుంజుకోవడం ఖాయం. ఇదంతా జరిగి గాడిలో పడేందుకు రెండు, మూడు నెలలు పట్టే అవకాశం వుండడంతో అప్పటి దాకా కరోనా నిబంధనలను నిక్కచ్చిగా పాటించడం.. లాక్ డౌన్ వంటి ప్రభుత్వ ఆదేశాలను తు.చ. తప్పకుండా ఫాలో అవడమే దేశప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం.

ALSO READ: ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ.. ప్రకటించేందుకు డబ్ల్యూహెచ్ఓ రెడీ.. కానీ మీనమేషాలెందుకంటే?

ALSO READ: మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు.. ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య భీకర పోరు షురూ!