Manmohan Singh funeral: నేడు అధికార లాంఛనలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. మాజీ ప్రధానికి స్మారక స్థూపం నిర్మిస్తామని కేంద్రం ప్రకటన
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం..కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఏఐసీసీ కార్యాలయం నుంచి మన్మోహన్‌సింగ్ అంతిమ యాత్ర మొదలవుతోంది. అయితే మన్మోహన్‌సింగ్ అంత్యక్రియల ఏర్పాట్లపై..అసంతృప్తి వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ పట్ల మోదీ ప్రభుత్వ తీరు సరిగా లేదని మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి కారణమేంటంటే..
అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు..ఢిల్లీలో నేడు కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనలతో జరగనున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ ఉదయం 11 గంటల 45 నిమిషాలకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అంతిమ సంస్కారాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కోరినట్లు చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్‌సింగ్ అంత్యక్రియల కోసం వీర్‌భూమి లేదా శక్తి స్థల్‌లో కొంత భాగం కేటాయించాలని కేంద్రాన్ని కోరింది కాంగ్రెస్ పార్టీ. అక్కడే మన్మోహన్ సమాధి నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోవడంపై కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేస్తోంది. మన్మోహన్‌ను ప్రభుత్వం అవమానిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాజ్ ఘాట్ దగ్గర స్థలం కేటాయించాలంటూ ప్రధానికి లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు యమునా నది తీరంలోని రాజ్ ఘాట్ దగ్గర స్థలం కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు..కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. అలాగే ఫోన్ కూడా చేసినట్లు చెప్పారు. ఈ మేరకు సోషల్‌మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టిన ఖర్గే..గతంలో పలువురు మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞుల అంత్యక్రియలు రాజ్ ఘాట్ లోనే జరిగాయని, అక్కడే సంప్రదాయం ప్రకారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారకం ఏర్పాటు కోసం అక్కడే స్థలం ఇవ్వాలని కోరారు. దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉన్నారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమైనవన్న ఖర్గే..ఆయన సముచితంగా గౌరవించుకోవాలన్నారు.
పీవీ అంత్యక్రియల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు
గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అధికారంలో ఉండి కూడా ఢిల్లీలో అంత్యక్రియలు జరగనివ్వకుండా హైదరాబాద్‌కు ఆయన భౌతిక కాయం పంపారన్న విమర్శలు ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. దీంతో మన్మోహన్ సింగ్ విషయంలో అలాంటి తప్పిదం జరగకూడదని భావిస్తోంది. వాస్తవానికి 2013లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం..ఢిల్లీలో ప్రత్యేకంగా మరే నాయకుడికి ప్రత్యేకంగా స్మారకాలను ఏర్పాటు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. రాజధానిలో స్థలాభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటి యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మాజీప్రధాని మన్మోహన్‌సింగ్‌కు స్మారకం ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..