Corona Second Wave: రెండో దశలో రెచ్చిపోతున్న కరోనా.. ఓవైపు వైరస్.. ఇంకోవైపు వ్యాక్సిన్ కొరత
ఓవైపు కరోనా సెకెండ్ వేవ్ విజృంభణ, మరోవైపు కరోనా వాక్సిన్ కొరత అంటూ కథనాలు.. వెరసి యావత్ దేశం మరోసారి కరోనా పడగ కిందకు చేరుతోంది. గత నాలుగు రోజులుగా ప్రతీ రోజూ..
Corona Second Wave hitting the country: ఓవైపు కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) విజృంభణ, మరోవైపు కరోనా వాక్సిన్ (CORONA VACCINE) కొరత అంటూ కథనాలు.. వెరసి యావత్ దేశం మరోసారి కరోనా పడగ కిందకు చేరుతోంది. గత నాలుగు రోజులుగా ప్రతీ రోజూ లక్షకు పైగా కరోనా (CORONA) కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు దేశ అవసరాలను పట్టించుకోకుండా వ్యాక్సిన్ మైత్రి (VACCINE MAITRI) పేరిట కోట్లాది వ్యాక్సిన్ డోసులు ఇతర దేశాలకు పంపడంతో ఇక్కడ వ్యాక్సిన్ కొరత ఏర్పడినట్లు కథనాలు వస్తున్నాయి. మహారాష్ట్ర (MAHARASHTRA) వంటి కరోనా నియంత్రణలో ఫెయిలైన రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరత అంశాన్ని లేవనెత్తడంతో దేశంలో కరోనా వ్యాక్సినేషన్ (CORONA VACCINATION) పంపిణీపై రాజకీయ రచ్చకు తెరలేచింది.
దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతీ రోజు లక్షకు మించి కరోనా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ఏప్రిల్ 3వ తేదీన లక్షా మూడు వేల కేసులు నమోదు కాగా.. రెండ్రోజుల తర్వాత ఏకంగా లక్షా 15 వేల కేసులు, తాజాగా ఏప్రిల్ 8వ తేదీన ఉదయం వెల్లడైన గణాంకాలలో ఏకంగా లక్షా 26 వేల కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇందులో 60 శాతం ఒక్క మహారాష్ట్రలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబయి (MUMBAI), నాగ్‌పూర్ (NAGPUR), పుణె (PUNE) నగరాలు కరోనా వైరస్ వ్యాప్తితో విలవిలలాడుతున్నాయి. కాగా దేశంలో కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు 8 లక్షలను దాటి పోయాయి. ఫిబ్రవరి రెండో వారంలో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నర మాత్రమే వుండింది.
కరోనా సెకెండ్ వేవ్ తీవ్రమవుతున్న తరుణంలో పలు రాష్ట్రాలు రాత్రి పూట కర్ఫ్యూ (NIGHT CURFEW) విధించాయి. ముంబయి నగరంతోపాటు నాగ్‌పూర్ సహా కొన్ని చోట్ల ముందుగా రాత్రి పూట కర్ఫ్యూ పెట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత రాష్ట్రంలో ఏకంగా ఒక్కో రోజు యాభై వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. అయితే.. ఈ కర్ఫ్యూ పెద్దగా ప్రభావం చూపిన సంకేతాలు మాత్రం కనిపించడం లేదు. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ (GUJARAT), పంజాబ్ (PUNJAB), ఢిల్లీ (DELHI), ఉత్తర్ ప్రదేశ్ (UTTAR PRADESH) ప్రభుత్వాలు కూడా రాత్రి పూట కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నాయి. కర్నాటక (KARNATAKA) రాజధాని బెంగళూరు (BANGALORE)లో 144 సెక్షన్ విధించారు. జనం పని లేకుండా బయటకొస్తే ఊరుకోవడం లేదు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి 28 లక్షల ఒక వేల 785కు చేరుకుంది. కొత్తగా 630 మంది గత ఇరవై నాలుగు గంటల్లో (ఏప్రిల్ 7వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ ఉదయం వరకు) దాంతో కరోనా మృతుల సంఖ్య దేశంలో లక్షా 66 వేల 177కు చేరింది. గత సంవత్సరం జనవరి 31న దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఆ తర్వాత క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. లాక్ డౌన్ (LOCK DOWN) కాలంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో వున్నప్పటికీ లాక్ డౌన్ ఎత్తివేత (UNLOCK DOWN) మొదలైన తర్వాత దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. 2020 జులై 17వ తేదీన దేశంలో కరోనా కేసుల సంఖ్య తొలిసారి పది లక్షలను దాటింది. ఆ తర్వాత 20 రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య రెట్టింపైంది. ఆగస్టు 7వ తేదీన దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. అదే క్రమంలో ఆగస్టు 23వ తేదీన 30 లక్షల మార్కును, సెప్టెంబర్ 5వ తేదీన 40 లక్షల మార్కును, సెప్టెంబర్ 16వ తేదీన 50 లక్షల మార్కును, అదే నెల 28వ తేదీన 60 లక్షల మార్కును, అక్టోబర్ 11వ తేదీన 70 లక్షల మార్కును అక్టోబర్ 29న 80 లక్షల మార్కును దాటింది. ఆ తర్వాత వైరస్ విస్తరణ నెమ్మదించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే అక్టోబర్ 29న 80 లక్షల మార్కును దాటగా.. మరో పది లక్షల కేసులు నమోదు అవడానికి నవంబర్ 20 దాకా టైమ్ పట్టింది. నవంబర్ 20న 90 లక్షల మార్కును దాటగా.. డిసెంబర్ 19న దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి మార్కును దాటింది.
ఇదే క్రమంలో కరోనా వైరస్ నెమ్మదించినట్లు గుర్తించగా.. దేశ ప్రజల్లో మెల్లిగా అలసత్వం మొదలైంది. కరోనా నిబంధనలను పూర్తిగా విస్మరించడం ప్రారంభమైంది. దానిక తోడు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మళ్ళీ ఊపందుకున్నాయి. మరోవైపు బార్లు, రెస్టారెంట్లు కరోనా నిబంధనలను గాలి వదిలేశాయి. వివిద మతాలకు చెందిన పవిత్ర స్థలాలకు జనం పెద్ద సంఖ్యలో రావడం మొదలైంది. ఈ కార్యకలాపాలన్నింటి వల్ల దేశంలో కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. ఫిబ్రవరి రెండో వారం నుంచి దేశంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. కానీ కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం తగ్గి పోవడం వల్ల ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కేంద్ర రోటీన్‌గా మార్గదర్శకాలనిస్తుందన్న నెపంతో రాష్ట్రాలు కరోనా నిబంధనల అమలును గాలికి వదిలేశాయి. మాస్కు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ వాడకం తగ్గిపోవడం వల్ల దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రమైంది. దానికి తోడు యుకే, సౌతాఫ్రికాల నుంచి పరిణితి చెందిన కరోనా వైరస్ దేశంలోకి ఎంటరైంది. ఇది కూడా సెకెండ్ వేవ్ తీవ్రత పెంచేందుకు కారణమైంది. ఫలితంగా ఏప్రిల్ 8వ తేదీ నాటికి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి 28 లక్షల ఒక వేయి 785కి చేరుకుంది.
ఒకవైపు కరోనా సెకెండ్ వేవ్ తీవ్రమవుతూ వుంటే.. ఇంకోవైపు జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ పంపిణీ ఊపందుకోకపోవడం కూడా ఇబ్బందిని పెంచుతోంది. దాదాపు మూడు నెలల తర్వాత కూడా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ 10 శాతం ప్రజలకు కూడా చేరకపోవడం విచిత్రంగా కనిపిస్తోంది. ప్రపంచంలోని 84 దేశాలకు వ్యాక్సిన్ మైత్రి పేరిట వ్యాక్సిన్‌ను సరఫరా చేసి.. ప్రపంచ ఆరోగ్య సంస్థచే ప్రశంసలు అందుకున్న భారత దేశంలో.. ఇక్కడి ప్రజలకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయలేకపోవడంపై రాజకీయ రచ్చ మొదలైంది. కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలమైన కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని నిందించడం మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా మహారాష్ట్రకు తగినంత సంఖ్యలో కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేయలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఆరోపించారు. దాన్ని కేంద్ర మంత్రులు హర్షవర్దన్, రవిశంకర్ ప్రసాదులు తోసిపుచ్చారు. వ్యాక్సిన్ల వేస్టేజ్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో వుందని, ఆ రాష్ట్రంలో 6 శాతం వ్యాక్సిన్లు వృధా అవుతున్నాయని వారు ఎదురు దాడి చేశారు.
ఇదిలా వుంటే.. తెలుగు రాష్ట్రాలలో కరోనా వ్యాక్సిన్‌ల కొరత కనిపిస్తోంది. వ్యాక్సినేషన్ కోసం జనం పెద్ద సంఖ్యలో ఉత్సాహం చూపడం, తగినంత సంఖ్యలో వ్యాక్సిన్లు నిల్వ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ పంపిణీ నత్తనడకన సాగుతోంది. మరో వైపు కొవాగ్జిన్ టీకా నిల్వల కొరత ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే కోవిషీల్డ్ టీకా నిల్వల పరిస్ధితి ఇదేరకంగా ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి. జనవరి 16న వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కాగా.. తొలి దశలో కరోనా నియంత్రణకు పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత 60 ఏళ్ళకుపైబడిన వారందరికీ, 45 నుంచి 59 ఏళ్ళ మధ్య వయస్కుల్లో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారికి పంపిణీ మొదలైంది. అయితే.. మార్చి రెండో వారం తర్వాత గానీ దేశంలో వ్యాక్సిన పంపిణీ వేగమందుకోలేదు. టీకా పంపిణీని వేగవంతం చేయాలని తలపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని ఆదేశాల జారీ చేసింది. దీంతో కరోనా టీకా పంపిణీ వేగవంతమైంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతీ రోజు పది వేల మందికి పైగా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 4.5 లక్షల కొవాగ్జిన్ డోసులు రాగా వాటిలో రెండున్నర లక్షల డోసుల టీకా పంపిణీ అయ్యింది.
అటు ఏపీలోను వ్యాక్సినేషన్ ఊపందుకుంది. అక్కడ 4 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నిల్వవున్న వ్యాక్సిన్ డోసులు మరో మూడు రోజులకే సరిపోతాయని సమాచారం. రాష్ట్రస్థాయి వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాల్లో జీరో స్ధాయికి నిల్వలు చేరుకుంటున్నాయి. అత్యవసరంగా కోటి డోసుల వ్యాక్సిన్ పంపించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దానికి కేంద్రం తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. దాంతో కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలియదని అధికారులు వాపోతున్నారు. అత్యవసరంగా మూడు లక్షల డోస్‌లు మాత్రమే సరఫరా చేస్తామని కేంద్రం తాజాగా సమాచారమిచ్చింది. మరో 10 లక్షల డోసులను ఏప్రిల్ రెండో వారంలో పంపుతామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలుస్తోంది.
కోవాగ్జిన్ మొదటి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్ ఇవ్వటం లేదని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ లేనందున్న రెండో డోసుగా కొవిషీల్డ్ తీసుకోవాలన్న సూచనలు వినిపిస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ, అధికార ప్రముఖులు కోవాగ్జిన్ టీకాను వేయించుకోవడంతో దానికి ప్రజల్లో డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు కొరత ఏర్పడింది. మొదటి డోస్ వేసుకున్న వారికి రెండో డోస్ ఎలా వేయాలా అని అధికారులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రెండో డోస్ కొవాగ్జిన్ వేయించుకోవాల్సిన వారి పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది.