పెళ్లిళ్ల కోసం రోడ్డెక్కి నిరసన తెలిపిన పెళ్లి కూతుళ్లు…
కరోనా సంగతి తర్వాత ముందు మా పెళ్లి సంగతి చూడండి మహాప్రభో అంటున్నారు పెళ్లి కూతుళ్లు... అంతేనా రోడ్డు కూడా ఎక్కారు.. ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకు నిప్పు కావాలని అడిగాడట వెనుకటికెవడో! కరోనావైరస్‌తో లోకమంతా కకావికలం అవుతుంటే.. కరోనా సంగతి తర్వాత ముందు మా పెళ్లి సంగతి చూడండి మహాప్రభో అంటున్నారు పెళ్లి కూతుళ్లు… అంతేనా రోడ్డు కూడా ఎక్కారు.. ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.. ఇది మనదగ్గర కాదు లేండి.. ఇటలీలో! అక్కడ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం.. పలు ఆంక్షలు కూడా విధించింది.. ఇప్పటికీ ఆ ఆంక్షలు కొనసాగుతున్నాయి..
ఈ వెధవ లాక్‌డౌన్ కారణంగానే తమ పెళ్లిళ్లు ఆగిపోయాయని, వెంటనే లాక్‌డౌన్‌ను ఎత్తివేసి తమను మిస్ నుంచి మిసెస్‌గా మార్చేయమని పెద్ద ఆందోళన చేపట్టారు.. ఐకానిక్ ట్రెవి ఫౌంటెన్ దగ్గర జరిగిన ఫ్లాష్ మాబ్‌లో పెళ్లి దుస్తుల్లోనే పాల్గొన్న ఓ 15 మంది వధువులు ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. గట్టిగా నినాదాలు చేశారు.. పెళ్లిళ్లపై ఆంక్షల్ని ఎత్తి వేయాలని, తమకు వివాహయోగ్యం ప్రసాదించాలని డిమాండ్ చేశారు. ఆంక్షలు విధించి తమ పెళ్లిళ్లు ఆగిపోయేలా చేశారంటూ ప్ల కార్డులపై రాసి మరీ నిరసనలకు దిగారు. అన్నట్టు పార్లమెంటు భవనం ఎదుట కూడా వీరు వధువులు నిరసన తెలియచేశారు. అవును మరి… పీత కష్టాలు పీతవి..!