తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నకరోనా విజృంభణ..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 75 వేలు దాటింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ప్రతాపం చూపెడుతోంది.

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన రెండు వారాలుగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు సగటున 3,000లకు పైగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 75 వేలు దాటింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ప్రతాపం చూపెడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మళ్లీ తిరగబెడుతోంది. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2051కాగా, తెలంగాణలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,326కు చేరింది.
తెలంగాణలో గత రెండు రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 79 కేసులు నమోదు కాగా, మంగళవారం మరో 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 37 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాగా, 14 మంది వలస కూలీలవి కావడం విశేషం. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,326కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి 822 మంది డిశ్చార్జ్ అయ్యారు. అందులో మంగళవారం ఒక్కరోజే 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనాతో పోరాడి ఇప్పటివరకు 32 మంది చనిపోయారు.




