AP Health : హెల్ప్‌డెస్క్‌లను మరింత మెరుగు పర్చండి.. బ్లాక్ ఫంగస్‌కు పూర్తి స్థాయి వైద్యం అందించండి : మంత్రి ఆళ్ల నాని
పశ్చిమగోదావరి జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్క్‌ల పనితీరుపై ఆళ్ల నాని ఆరా తీశారు..
AP Minister Alla Nani : కరోనా పాజిటివ్ వచ్చిన కొంత మంది రోగులకు బ్లాక్ ఫంగస్ సోకుతున్న నేపథ్యంలో పేషెంట్లకు అవసరమైన పూర్తిస్థాయి వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్క్‌ల పనితీరుపై ఆళ్ల నాని ఆరా తీశారు. దీనికి సంబంధించి డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్ సూపరింటెండెంట్లతో ఆళ్ల నాని ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్ ఆధారంగా ఆక్సిజన్ సదుపాయం ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను వాడుకోవాలని సూచించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో కొవిడ్ ఆస్పత్రుల హెల్ప్ డెస్క్‌ల్లో సమాచారం అందడం లేదని వస్తున్న వార్తలపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. 24 గంటల పాటు షిఫ్ట్ పద్దతిలో సిబ్బందిని నియమించాలని నాని ఆదేశించారు. జిల్లాలో కరోనా బాధితులకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడానికి అనుసంధానంగా ఉండేందుకు కరోనా ఆస్పత్రులలోని కొవిడ్ కేర్ సెంటర్లల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో కొద్దికాలం పాటు హెల్ప్‌డెస్క్ సిబ్బంది పని తీరు బాగానే ఉన్నప్పటికీ గత నెల 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈ బోర్డులో వివరాలు నమోదు చేయడం పూర్తిగా మానివేశారు. దీంతో ఆ బోర్డును చూసిన వారు అయోమయానికి గురవుతున్నారు. ఈ అంశాన్ని కూడా మంత్రి సమీక్షలో ప్రస్తావించారు.