ఏపీలో మరో 3 కరోనా ల్యాబోరేటరీలు..
ఏపీలో కరోనా గంటగంటకూ విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు యటపడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 152కి చేరింది...

ఏపీలో కరోనా గంటగంటకూ విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు యటపడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 152కి చేరింది. గురువారం సాయంత్రం ఆరు గంటల వరకూ 143 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరు గంటల తరువాత మరో 9 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. కోరలు చాస్తోన్న కరోనాను వ్యాప్తిచెందకుండా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వైరస్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం మరో మూడు ల్యాబొరేటరీలు సిద్ధం చేసింది.
రాష్ట్రంపై కరోనా పంజా విసురుతోంది. పెద్ద సంఖ్యలో బయటపడుతున్న వైరస్ కేసులు ఆందోళన రేపుతున్నాయి. ఇంకా వేల సంఖ్యలో అనుమానితులు ఉండగా, నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ల్యాబొరేటరీలు పనిచేస్తున్నాయి. శనివారం నుంచి కడప, గుంటూరులలో ఏర్పాటు చేసిన ల్యాబొరేటరీలు అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఆదివారం సాయంత్రానికి విశాఖలోని ల్యాబొరేటరీని కూడా సేవల పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 450 కరోనా వైరస్ నిర్ధారణ టెస్టులు జరుగుతుండగా, ఈ కొత్త ల్యాబులు అందుబాటులోకి వస్తే ఆ సంఖ్య 570 టెస్టులకు పెరుగుతుంది. దీంతో రవాణా వ్యయం తగ్గటంతో పాటుగా, ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.