Re-Entry 2025: వెండితెరపై మళ్ళీ మెరిసిన అలనాటి తారలు.. విరామం తర్వాత కెమెరా ముందుకు సెలబ్రిటీలు!
ఒకప్పుడు వెండితెరపై తమ నటనతో, అందంతో కోట్లాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఆ నటులు ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యారు. పెళ్లిళ్లు, రాజకీయాలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఇక వారు మళ్ళీ కెమెరా ముందుకు రారేమో అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కానీ రక్తం ..

ఒకప్పుడు వెండితెరపై తమ నటనతో, అందంతో కోట్లాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఆ నటులు ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యారు. పెళ్లిళ్లు, రాజకీయాలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఇక వారు మళ్ళీ కెమెరా ముందుకు రారేమో అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కానీ రక్తం లోనే నటన ఉన్నప్పుడు, ఆ కళ వారిని ఎన్నాళ్లు దూరం ఉంచుతుంది? అందుకే కాలం కలిసి రావడంతో, దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత వారు మళ్ళీ బిగ్ స్క్రీన్ పై మెరిశారు. 2025 ఏడాది చాలా మంది సీనియర్ నటీనటులకు ఒక మరపురాని సంవత్సరంగా నిలిచింది. ఒకరు 14 ఏళ్ల తర్వాత, మరొకరు ఏకంగా 22 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకుని థియేటర్లలో సందడి చేశారు. మరి రీ-ఎంట్రీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ నటులు ఎవరు?
ఈ ఏడాది కమ్ బ్యాక్ ఇచ్చిన వారిలో 1980ల నాటి హీరో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ‘ఛాంపియన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో రాజి రెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో ఆయన నటన చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు.
అలాగే ఒకనాటి అందాల తార మంజుల కుమార్తె శ్రీదేవి విజయ్‌కుమార్ కూడా చాలా కాలం తర్వాత ‘సుందరకాండ’ అనే సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ తొలి సినిమా హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఆమె, ఇందులో వైష్ణవి అనే మధ్యవయస్కురాలి పాత్రలో కనిపించి మెప్పించారు. 2011 తర్వాత ఆమె మళ్ళీ ఇప్పుడే వెండితెరపై కనిపించడం విశేషం.
ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకున్న లయ, 14 ఏళ్ల విరామం తర్వాత నితిన్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో హీరో సోదరిగా ఎమోషనల్ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ఇక ‘బొమ్మరిల్లు’ హాసినిగా అందరినీ అలరించిన జెనీలియా కూడా 13 ఏళ్ల తర్వాత తెలుగు తెరపై తళుక్కుమన్నారు. ‘జూనియర్’ అనే సినిమాతో ఆమె టాలీవుడ్‌లోకి ఘనంగా పునఃప్రవేశం చేశారు. అలాగే ‘మన్మథుడు’ సినిమాలో తన అందంతో కట్టిపడేసిన అన్షు, దాదాపు 22 ఏళ్ల తర్వాత ‘మజాకా’ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సందీప్ కిషన్ సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో మెరిశారు.
వీరితో పాటు ‘నువ్వు నేను’ ఫేమ్ అనిత 20 ఏళ్ల తర్వాత ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాతో, కామ్నా జెఠ్మలానీ 12 ఏళ్ల తర్వాత ‘కె-ర్యాంప్’ తో వెండితెరపై కనిపించారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ లో పవర్ ఫుల్ పాత్రతో అలరించారు. ‘ఆది’ హీరోయిన్ కీర్తి చావ్లా ‘లైలా’ సినిమాలో, సింధు తులానీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లో కనిపించి పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు.

Kalyan Kamna And Anshu
బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ‘బ్రహ్మ ఆనందం’ సినిమాతో, ధనరాజ్ ‘రామం రాఘవం’ తో కెమెరా ముందుకు వచ్చారు. ‘రోజా’ ఫేమ్ మధుబాల ‘కన్నప్ప’ లో ఒక తెగ నాయకురాలిగా, బింధు మాధవి ‘దండోరా’ సినిమాలో నటించి తమ ఉనికిని చాటుకున్నారు.
తెరమరుగయ్యారనుకున్న నటీనటులంతా 2025లో మళ్ళీ బిగ్ స్క్రీన్ పై మెరవడం సినీ ప్రియులకు కన్నుల పండువగా ఉంది. తమ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మునుపటి వాడిని, వేడిని ప్రదర్శిస్తూ ఈ సీనియర్లు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాబోయే 2026లో ఇంకెందరు అలనాటి తారలు వెలుగులోకి వస్తారో చూడాలి.
