AP Corona: ఏపీలో కొనసాగుతున్న కరోనా.. మళ్లీ ఆరు వేలకు పైగా కేసులు.. మరిన్ని ఆంక్షల దిశగా సర్కార్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ 6 వేలకుపైగా నమోదయ్యాయి.
Andhra Pradesh Covid 19 Cases today updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కరోనా వైరస్(Corona Virus) పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ 6 వేలకుపైగా నమోదయ్యాయి. కేసులు పెరగుతుండటంతో మరణాలు కూడా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,035 పరీక్షలు నిర్వహించగా.. 6,213 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ(AP Medical and Health Department) వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,82,583కి చేరింది.
కరోనా కారణంగా గడిచిన 24గంటల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కోవిడ్ వల్ల చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,620గా ఉంది. 24 గంటల వ్యవధిలో 10,795 మంది బాధితులు కోలుకోవడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 21,62,033కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,05,930 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,25,05,747 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
మరోవైపు ఏపీలో కరోనా ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో కొవిడ్ ఆంక్షలను కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగించింది జగన్ సర్కారు. ఫిబ్రవరి 14 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి జీవో మంగళవారం విడుదల చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఏపీలో కరోనా ఆంక్షలు కూడా కొనసాగనున్నాయి.
ఇందులో భాగంగా ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించింది. మాస్కులు ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. అలాగే షాపింగ్ మాల్స్ తదితర వాటిల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోతే 10 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
వివాహాలు, మతపరమైన కార్యక్రమాలకు.. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్‌లలో అయితే 100 మంది కంటే ఎక్కువగా హాజరుకాకూడదని జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా 50 శాతం కెపాసిటీతో థియేటర్లను నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రేక్షకులకు మాస్క్ తప్పనిసరి చేయాలని ఏపీ సర్కార్ పేర్కొంది. Read Also….. Post COVID Problems: కరోనాతో వచ్చే దీర్ఘకాలిక ఇబ్బందుల గురించి తెలుసా? మీకు తరచూ ఈ సమస్య వస్తుంటే జాగ్రత్త!