ఏపీలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా 6 వేలకు పైగా కొత్త కేసులు.. ఇవాళ మరో 20 మంది మృతి

ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే 6వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది

  • Balaraju Goud
  • Publish Date - 7:24 pm, Fri, 16 April 21
ఏపీలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా 6 వేలకు పైగా కొత్త కేసులు.. ఇవాళ మరో 20 మంది మృతి

AP Corona cases: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే 6వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిన్న 5 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క రోజు వ్యవధిలో వెయ్యికి పైగా కేసులు పెరిగాయి.

ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 35,962 సాంపిల్స్ ని పరీక్షించగా 6,096 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా నమోదైన 5086 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,48,231 కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 20 మంది మృతి ప్రాణాలను కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపూర్, వైఎస్ఆర్ కడప, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు చొప్పున మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 7,373కి చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య ఈ సాయంత్రం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 2,194 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 9,05,266 కి చేరి సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 35,592 యాక్టివ్ కేసులున్నాయి. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,56,06,163 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగిందని ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,024 కేసులు నమోదు కాగా, అనంతపురంలో 313, తూర్పుగోదావరిలో 750, గుంటూరులో 735, కడపలో 243, కృష్ణాలో 246, కర్నూలులో 550, నెల్లూరులో 354, ప్రకాశంలో 491, శ్రీకాకుళంలో 534, విశాఖపట్నంలో 489, విజయనగరంలో 299, పశ్చిమగోదావరిలో 68 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. కాగా, రాష్ట్రంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రానికి సరిపడ అదనపు వ్యాక్సిన్ల అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసారు.

Ap Corona Today Update

Ap Corona Today Update