MBBS Admissions: కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ వెబ్‌ఆప్షన్లు ప్రారంభం.. సెప్టెంబర్ 29 వరకు అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం నుంచి వెబ్‌ఆప్షన్లు కూడా మొదలయ్యాయి. ఈ మేరకు అవకాశం కల్పిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. కన్వీనర్ కోటా సీట్లకు పోటీపడే విద్యార్ధులు..
హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం నుంచి వెబ్‌ఆప్షన్లు కూడా మొదలయ్యాయి. ఈ మేరకు అవకాశం కల్పిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. కన్వీనర్ కోటా సీట్లకు పోటీపడే విద్యార్ధులు సెప్టెంబర్ 26 ఉదయం 6 నుంచి సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు వెబ్‌ఆప్షన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే విద్యార్ధులు వెబ్ ఆప్షన్ల నమెదు ప్రారంభించారు.
కన్వీనర్ కోటా (కాంపిటెంట్ ఆథారిటీ కోటా)లో దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులు, పోలీసు అమరవీరుల పిల్లలు (పీఎంసీ), సైనికోద్యోగుల పిల్లలు (క్యాప్) కేటగిరీకి చెందిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్, మైనార్టీ/నాన్ మైనార్టీ మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేస్తున్నట్లు వివరించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెరిట్ జాబితా కాళోజీ వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో మొత్తం 34 ప్రభుత్వ, 22 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరో 4 ముస్లిం మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనుంది. కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న 16,694 మంది విద్యార్థుల తుది మెరిట్ జాబితాను విడుదల చేసింది. వీరితో పాటు కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్న విద్యార్థుల మెరిట్ జాబితాను వర్సిటీ పొందుపరిచింది. సీటు పొందిన విద్యార్థులు రూ.12 వేలు చెల్లించి ఎలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫీజు రూ.10 వేలు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో రూ.60 వేలు, ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీల్లో రూ. లక్షగా ఉంటుంది.
మొదటి రౌండ్‌లో కన్వీనర్ కోటా సీట్లకు వెబ్‌ఆప్షన్లు ఇవ్వని విద్యార్థులకు రెండో రౌండ్‌లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉండదు. అలాగే మొదటి రౌండ్‌లో ఎంబీబీఎస్ సీటు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో చేరకుంటే తర్వాత రౌండ్లలో కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత ఉండదు. ఈ మేరకు ఎంబీబీఎస్ ప్రవేశాల్లో అర్హతకు సంబంధించి హైకోర్టులోని పెండింగ్‌లో ఉన్న కేసుల తుది తీర్పునకు లోబడి సీట్ల కేటాయింపులు, అడ్మిషన్లు ఉంటాయని వర్సిటీ తన ప్రకటనలో వివరించింది. కన్వీనర్ కోటా వెబ్‌ఆప్షన్లను వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులకు ఇందుకు సంబంధించి ఎవైనా సందేహాలు, సమస్యలు ఉంటే 9392685856/7842136688/9059672216 నంబర్లకు ఫోన్ చేయొచ్చు. లేదా tsmedadm2024@gmail.comకు మెయిల్ పంపవచ్చని పేర్కొంది.
నర్ కోటా సీట్లకు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ప్రాథమిక తుది మెరిట్ జాబితాలో పేరున్నవారు కళాశాలల వారీగా ప్రాధాన్యాలను ఎంపిక చేసుకుని వెబ్ ఆప్షన్లను ఇవ్వాలి. నర్ కోటా సీటుకు రాష్ట్రంలోని ఎన్ని వైద్య కళాశాలలు కావాలంటే అన్ని కళాశాలలకు ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇక మైనార్టీ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ముస్లిం మైనార్టీ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తారు. వారు ఇతర కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సీటు కేటాయింపు సమాచారం విద్యార్థి మొబైల్ నంబరు మెసేజ్ ద్వారా పంపుతారు.