TSSPDCL Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ విద్యుత్ శాఖ నోటిఫికేషన్
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా నియమితులైన 1362 మంది జూనియన్ లైన్‌మెన్ల (జేఎల్‌ఎం)కు హైదరాబాద్‌లోని జెన్‌కో ఆడిటోరియంలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తాజాగా నియామకపత్రాలు అందజేశారు. తుది ఎంపికలో మొత్తం ఆరుగురు మహిళలు ఉన్నట్లు ఆయన తెలిపారు. గత నోటిఫికేషన్‌లో ఒకే ఒక మహిళ జూనియన్ లైన్‌మెన్ పోస్టులకు ఎంపిక కాగా ఈసారి ఆరుగురు ఉద్యోగాలు సాధించడం విశేషం అని ఆయన పేర్కొన్నారు. స్తంభాలు ఎక్కే క్లిష్టమైన పరీక్షను..
హైదరాబాద్, అక్టోబర్ 2: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా నియమితులైన 1362 మంది జూనియన్ లైన్‌మెన్ల (జేఎల్‌ఎం)కు హైదరాబాద్‌లోని జెన్‌కో ఆడిటోరియంలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తాజాగా నియామకపత్రాలు అందజేశారు. తుది ఎంపికలో మొత్తం ఆరుగురు మహిళలు ఉన్నట్లు ఆయన తెలిపారు. గత నోటిఫికేషన్‌లో ఒకే ఒక మహిళ జూనియన్ లైన్‌మెన్ పోస్టులకు ఎంపిక కాగా ఈసారి ఆరుగురు ఉద్యోగాలు సాధించడం విశేషం అని ఆయన పేర్కొన్నారు. స్తంభాలు ఎక్కే క్లిష్టమైన పరీక్షను అధిగమించి ఉద్యోగాలకు ఎంపికవడం అభినందనీయం అని మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో దాదాపు 35,774 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 10,312 పోస్టులు, ట్రాన్స్‌కోలో 4403 పోస్టులు, జెన్కోలో 3,689 పోస్టులు, ఎన్‌పీడీసీఎల్‌లో 4,370 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించడి.. 13 వేల ఉద్యోగాలు నేరుగా భర్తీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో త్వరలో మరో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.
గేట్ 2024 దరఖాస్తు గడువు పెంపు
దేశ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2024 దరఖాస్తు గడువు అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించారు. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ మేరకు తెలియజేస్తూ ప్రకటన వెలువరించారు. గేట్ పరీక్ష స్కోరు ఆధారంగా ఉన్నత విద్య చదువుకోవడంతోపాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల ఎంపికకు సైతం గేట్ స్కోర్ ఉపయోగపడుతుంది. కాగా ఈ ఏడాది గేట్‌ను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) నిర్వహించనున్న సంగతి తెలిసిందే. గేట్ 2024 పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్ష జరుగుతుంది.
సీబీఎస్‌ఈ ఎఫ్‌ఏ పరీక్ష తేదీల్లో మార్పు
సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 9 తరగతుల విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్-2 పరిక్షలను ఈ నెలలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్ష తేదీల్లో స్వల్పమార్పు చేసినట్లు బోర్డు ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 3 నుంచి 5 మధ్య నిర్వహించాల్సిన పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్షలు అక్టోబరు 6 నుంచి 9 మధ్య నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. పరీక్ష నమూనాలో చేసిన మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం పరీక్ష తేదీలను మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.