TS CPGET 2022: తెలంగాణలో సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల.. ఇవాళ్టి నుంచే దరఖాస్తులు..
TS CPGET 2022 Notification: ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఇవాళ్టి నుంచి జులై 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS CPGET) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఇవాళ్టి నుంచి జులై 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో జులై 15 వరకు దరఖాస్తులను సమర్పించొచ్చు. జులై 20 నుంచి సీపీగెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ యూనివర్సిటీల్లోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలను సీపీగెట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ 8 విశ్వవిద్యాలయాల పరిధిలోని 320 కళాశాలల్లోని 50 కోర్సుల్లో 44,604 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ సబ్జెక్టులో డిగ్రీ చదివిన వారైనా.. సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్ కోర్సుల్లో పీజీ చేసేలా ఈ ఏడాది నిబంధనలు సవరించినట్లు లింబాద్రి తెలిపారు.
అయితే.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలకు చెందిన ఉపకులపతులతో (VCs) ఉన్నత విద్యా మండలి (TSCHE) సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2022లో కీలక మార్పులు చేసింది. ఏ డిగ్రీ చేసిన విద్యార్థులైనా ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్స్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేసింది. ఎప్పటిమాదిరిగానే ఈ ఏడాది కూడా కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (TS CPGET 2022) నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కే అప్పగిస్తున్నట్లు తెల్పింది.
తెలంగాణ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఈ నెలాకరులో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ (2022-23) విద్యాసంవత్సరానికి సంబంధించి జీరో అడ్మిషన్లు నమోదైన కాలేజీలను, కోర్సులను రద్దు చేయాలని సమావేశంలో ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఒక కోర్సులో 15 మంది కంటే తక్కువ విద్యార్ధులు చేరితే వారిని ఇతర కోర్సులకు బదిలీ చేయడం లేదా డిస్టెన్స్ లో చేసే అవకాశం అవ్వాలని వీసీలకు సూచించింది.