Govt Jobs: ఒకే కుటుంబలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఒకే అటెంప్ట్ లో సక్సెస్.. మరో విశేషమేమిటంటే..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది చాలా మంది కల. ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితాంతం నిశ్చింతగా ఉండొచ్చని భావిస్తుంటారు. అందుకోసం రాత్రీపగలు అనే తేడా లేకుండా పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు...
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది చాలా మంది కల. ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితాంతం నిశ్చింతగా ఉండొచ్చని భావిస్తుంటారు. అందుకోసం రాత్రీపగలు అనే తేడా లేకుండా పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. కానీ అప్పడప్పుడూ అదృష్టం కూడా ఉండాలి. కొన్ని సందర్భాల్లో బాగా చదవడంతో పాటు అదృష్టం కలిసి వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు మంచి ఉద్యోగాలు సాధించి, బాగా స్థిరపడాలని అనుకుంటుంటారు. అయినా.. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మాటల్లో చెప్పినంత సులభం కాదు. కానీ ఓ కుటుంబం మాత్రం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ముగ్గురూ అన్నాచెల్లెళ్లు జాబ్ సాధించారు. బీహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాలోని నౌదేగా గ్రామానికి చెందిన సురేంద్ర లాల్‌దేవ్, అజయ్ కుమార్ అన్నదమ్ములు. సురేంద్రకు నేహా, షిప్రా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే అజయ్ కుమార్‌కు అనంత్ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. వీరంతా ఉమ్మడిగా నివాసం ఉంటున్నారు.
లాల్‌దేవ్ బీహార్ పోలీసు శాఖలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. అలాగే అజయ్ కుమార్, దర్భంగాలోని మధురాపూర్ మిడిల్ స్కూల్ లో హెడ్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తమ పిల్లలూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కలలుగన్నారు. వారు కూడా తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్టుగా కష్టపడ్డారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన 31వ జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్ష రాశారు. ఆ ఫలితాలు సోమవారం అర్థరాత్రి విడుదలయ్యాయి.
ఇందులో సురేంద్ర లాల్‌దేవ్, అజయ్ కుమార్ పిల్లలు ముగ్గురూ పాస్ అయ్యారు. మరో విశేషం ఏంటంటే వీరందరూ మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగాలు సాధించారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ముగ్గురూ ఉన్నతోద్యోగాలు సాధించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.