AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ

చరిత్రలో యుద్ధ వీరులు అనేకమంది ఉన్నారు. కానీ ఆయుధాలు లేకుండా, కేవలం దయ, ధైర్యం, మానవత్వంతో వేలాది మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి గొప్ప మహిళే ఐరీనా సెండ్లర్ (Irena Sendler). రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ ఆక్రమణలో ఉన్న పోలాండ్‌లో తన ప్రాణాలను పణంగా పెట్టి వేలాది మంది యూదు పిల్లలను నిద్ర మాత్రలు ఇచ్చి మరణం నుంచి రక్షించి చరిత్రలో నిలిచిపోయింది. ఆమె పేరు నేడు మానవత్వానికి ప్రతీకగా నిలిచిపోయింది..

Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ
Inspiring Story Of Irena Sendler
Srilakshmi C
|

Updated on: Jul 27, 2026 | 2:24 PM

Share

ఐరీనా సెండ్లర్ 1910 ఫిబ్రవరి 15న పోలాండ్‌లోని ఒట్వోక్ ప్రాంతంలో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్ స్టానిస్లావ్ క్రిజానోవ్స్కీ ఒక వైద్యుడు. పేదలను, ముఖ్యంగా యూదులను ఉచితంగా చికిత్స చేసేవారు. అంటువ్యాధితో బాధపడుతున్న రోగులకు సేవ చేస్తూ ఆయన అనారోగ్యానికి గురై మరణించారు. చిన్నప్పటి నుంచే ఐరీనా తన తండ్రి చెప్పిన ఒక మాటను జీవితాంతం గుర్తుంచుకుంది. ‘ఎవరైనా మునిగిపోతుంటే, అతను ఎవరో చూడకు; ముందుగా అతన్ని కాపాడు’. ఈ విలువలే తరువాత ఆమెను ప్రపంచ చరిత్రలో ఒక అసాధారణ మహిళగా నిలబెట్టాయి.

రెండో ప్రపంచ యుద్ధం-పిల్లలను రక్షించిన సాహసయాత్ర

రెండో ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమైంది. ఈ సమయంలో నాజీ జర్మనీ పోలాండ్‌పై దాడి చేసింది. అనంతరం వార్సా నగరంలోని లక్షలాది మంది యూదులను వార్సా ఘెట్టో అనే చిన్న ప్రాంతంలో నిర్బంధించింది. అక్కడ ఆహారం, మందులు, తాగునీరు, పరిశుభ్రత ఏదీ సరిపడా లేక వేలాది మంది ఆకలి, వ్యాధులతో మరణించారు. ఆ సమయంలో ఐరీనా వార్సా మున్సిపల్ సోషల్ వెల్ఫేర్ శాఖలో సామాజిక సేవకురాలిగా పనిచేస్తోంది. ఆ ఉద్యోగం కారణంగా ఆమెకు ఘెట్టోలోకి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి లభించింది. ఘెట్టోలోని పిల్లల దయనీయ పరిస్థితి చూసి ఐరీనా.. వారిని ఏ విధంగానైనా బయటకు తీసుకురావాలని నిశ్చయించుకుంది. ముందుగా ఆమె పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి.. పిల్లలను పోలిష్ భూగర్భ సంస్థ జెగోట్టతో కలిసి రహస్యంగా పిల్లలను బయటకు తరలించడం ప్రారంభించింది. అందుకు ఆమె ఉపయోగించిన పద్ధతులు తెలిస్తే మతిపోతుంది. అంబులెన్సుల్లో అనారోగ్య పిల్లలుగా బయటకు తీసుకురావడం. వారిని చెక్క పెట్టెలు, టూల్‌బాక్సులు, బస్తాల్లో దాచడం. ఆ తర్వాత మురుగునీటి కాలువలు, భూగర్భ మార్గాల ద్వారా తరలించడం. చిన్న పిల్లలకు నిద్రమందు ఇచ్చి కుక్కల మొరుగులతో వారి ఏడుపును దాచడం ద్వారా.. ఈ ప్రతి ప్రయత్నంలో ఆమె ఎక్కడ పట్టుబడినా మరణశిక్షకు దారితీసేది. అయినప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు.

కొత్త గుర్తింపుతో పిల్లలకు ఉన్నత భవిష్యత్తు

పిల్లలను రక్షించిన తర్వాత వారికి క్రైస్తవ పేర్లతో కొత్త గుర్తింపు పత్రాలు తయారు చేసేది. అనంతరం వారిని అనాథాశ్రమాల్లో, చర్చిల్లో, కాన్వెంట్లలో, పోలిష్ కుటుంబాల్లో రహస్యంగా ఉంచేది. యుద్ధం ముగిసిన తర్వాత వారిని వారి అసలు కుటుంబాలకు తిరిగి చేర్చాలనే ఉద్దేశంతో, ప్రతి పిల్లవాడి అసలు పేరు, కొత్త పేరును రహస్య సంకేతాలతో నమోదు చేసి సీసాలు లేదా జాడీల్లో భద్రపరిచి, దానిని ఓ చెట్టు కింద పాతిపెట్టింది. అయితే 1943లో నాజీ రహస్య పోలీసులు (గెస్టాపో) ఐరీనాను అరెస్టు చేశారు. ఆమెను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశారు. కాళ్లు కూడా విరిచారు. అనేక రకాలుగా విచారించి.. చివరకు మరణశిక్ష విధించారు. అయినప్పటికీ ఒక్క పిల్లవాడి పేరు కూడా ఆమె బయటపెట్టలేదు. చివరకు భూగర్భ సంస్థ సభ్యులు లంచం ఇచ్చి ఆమెను జైలు నుంచి తప్పించగలిగారు. విడుదలైన తర్వాత కూడా ఆమె కొత్త పేరుతో అదే సేవను కొనసాగించింది. యుద్ధం ముగిసిన తర్వాత 90 శాతం మంది పిల్లల తల్లిదండ్రులు హోలోకాస్ట్‌లో మరణించినట్లు తెలిసింది. అయినప్పటికీ, బతికి ఉన్న బంధువులను వెతికి పిల్లలను వారికి చేర్చేందుకు ఐరీనా ప్రయత్నించింది. ఆమె చేసిన సేవలు ప్రపంచానికి ఆలస్యంగా తెలిసాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ఆలస్యంగా వెలుగులోకి

1965లో Righteous Among the Nations గౌరవం, పోలాండ్ అత్యున్నత పౌర పురస్కారం Order of the White Eagle, 2007లో నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ చేశారు. 2008 మే 12న 98 ఏళ్ల వయసులో ఆమె మరణించారు. ఆమె రక్షించిన పిల్లల సంఖ్య సుమారు 2,500 మందిని రక్షించిందని పేర్కొంటారు. అయితే చరిత్రకారులు ఈ సంఖ్య మొత్తం ఐరీనా, ఆమెతో కలిసి పనిచేసిన నెట్‌వర్క్ చేసిన రక్షణ చర్యలకు సంబంధించినదని, ఖచ్చితమైన వ్యక్తిగత సంఖ్యను నిర్ధారించడం కష్టమని సూచిస్తున్నారు. అయినప్పటికీ ఆమె పాత్ర అసాధారణమైనదని తెలిపారు.

ఐరీనా సెండ్లర్ చేతిలో తుపాకీ లేదు. సైన్యం లేదు. అధికారం లేదు. కానీ ఆమెకు అపారమైన దయ, అచంచలమైన ధైర్యం, మానవత్వంపై విశ్వాసం ఉన్నాయి. ఆ విలువలే ఆమెను ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప మానవతావాదుల్లో ఒకరిగా నిలబెట్టాయి. యుద్ధం అనే చీకటిలో వేలాది మంది పిల్లలకు ఆమె ఆశాకిరణమైంది. అందుకే ఆమె పేరు నేడు కూడా మానవత్వం, సేవ, ధైర్యానికి చిరస్మరణీయమైన ప్రతీకగా నిలిచింది. ఐరీనా సెండ్లర్ జీవితం చెప్పే పాఠాలు వెలకట్టలేనివి. మానవత్వం కంటే గొప్ప మతం లేదు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయం ఉన్నా సరైన పని చేయడం. ఒక్క వ్యక్తి సంకల్పం వేలాది జీవితాలను మార్చగలదు. కరుణతో చేసిన పని చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది.

Follow Us
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌ గాథ
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
ఇన్నాళ్లూ పొరపాటు చేశామా.. మటన్ లివర్ vs చికెన్ లివర్ గురించి..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
1949లో తొలి కమర్షియల్ జెట్ విమానం గాల్లోకి ఎగిరింది! ఆ తర్వాత..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు..
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..