AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Lesson: జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి

కొన్ని సమస్యలు మన ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. కొన్ని సమస్యలు కాలంతో పరిష్కారమవుతాయి. మరికొన్ని సమస్యలను మనం అంగీకరించి ముందుకు సాగాల్సి ఉంటుంది. అన్ని సమస్యలు పూర్తిగా ముగిసిన తర్వాతే సంతోషంగా ఉంటానని ఎదురుచూస్తే, సంతోషంగా ఉండే అవకాశం ఎప్పటికీ రాకపోవచ్చు. సమస్యల మధ్య కూడా ప్రశాంతంగా జీవించడం నేర్చుకున్నప్పుడే నిజమైన శాంతి లభిస్తుంది. ఈ విషయాన్ని ఈ కింది కథ ద్వారా వివరంగా తెలుసుకోండి..

Life Lesson: జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి
100 Camels Story
Srilakshmi C
|

Updated on: Sep 26, 2026 | 6:00 AM

Share

ఒక ఎడారికి సమీపంలో ఉన్న చిన్న పట్టణంలో ఒక వ్యక్తి నివసించేవాడు. అతనికి జీవితంలో ఏదో ఒక సమస్య ఎప్పుడూ ఉండేది. అందుకే అతను తన జీవితంతో ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు కాదు. ప్రతి ఉదయం నిద్రలేవగానే అతని మనసులో ఏదో ఒక ఆందోళన మొదలయ్యేది. ‘నా ఉద్యోగం ఎలా ఉంటుంది?’ ‘నా ఆరోగ్యం బాగుందా?’ ‘ఇంట్లో సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయి?’ ‘ఇతరులతో ఎందుకు ఇన్ని గొడవలు వస్తున్నాయి?’.. ఇలా రోజంతా ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఒక సమస్య పరిష్కారమైతే మరో సమస్య అతని ముందుకు వచ్చేది. దాంతో అతనికి జీవితంలో ప్రశాంతత లేదని అనిపించేది.

ఒకరోజు ఆ పట్టణానికి ఒక గొప్ప జెన్ మాస్టర్ తన శిష్యుడితో కలిసి వచ్చాడని అతనికి తెలిసింది. ‘బహుశా ఈ జెన్ మాస్టర్ నా సమస్యలకు పరిష్కారం చూపగలడు. నా జీవితాన్ని ఎలా ప్రశాంతంగా మార్చుకోవాలో ఆయన చెప్పగలడు’ అని అనుకున్నాడు. ఆ సాయంత్రం జెన్ మాస్టర్‌ను కలవడానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ చాలామంది ఉన్నారు. కొంతసేపు వేచి చూసిన తర్వాత చివరకు మాస్టర్‌ను కలిసే అవకాశం వచ్చింది. ఆ వ్యక్తి మాస్టర్‌కు నమస్కరించి తన బాధను చెప్పుకున్నాడు. ‘మాస్టర్.. నేను నా జీవితంతో చాలా అసంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడూ ఏదో ఒక సమస్య నన్ను వెంటాడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఉద్యోగంలో సమస్య, కొన్నిసార్లు ఆరోగ్య సమస్య, మరికొన్నిసార్లు ఇంట్లో సమస్యలు. ఒకటి పరిష్కరించుకునేలోపే మరో సమస్య వచ్చేస్తోంది. దయచేసి నాకు ఒక మార్గం చెప్పండి. నా సమస్యలన్నీ ముగిసి, నేను ప్రశాంతంగా, సంతోషంగా జీవించేలా చేయండి’ అని వేడుకున్నాడు. జెన్ మాస్టర్ అతని మాటలను ప్రశాంతంగా విన్నాడు. చిరునవ్వుతో ‘మిత్రమా.. నీ ప్రశ్నకు సమాధానం రేపు ఉదయం చెబుతాను. అయితే ఈ రాత్రి నాకొక చిన్న సహాయం చేస్తావా?’ అని అడిగాడు.

‘తప్పకుండా మాస్టర్. మీరు ఏం చెప్పినా చేస్తాను’ అని ఆ వ్యక్తి అన్నాడు. జెన్ మాస్టర్ ఇలా చెప్పాడు. ‘ఈ పట్టణంలోని ఒక ధనవంతుడు నాకు 100 ఒంటెలను బహుమతిగా ఇచ్చాడు. నా ప్రయాణంలో వాటిని నాతో తీసుకెళ్లాలి. ఈ రాత్రి నువ్వు వాటిని జాగ్రత్తగా చూసుకో.’ ఆ వ్యక్తి వెంటనే అంగీకరించాడు. అప్పుడు మాస్టర్ ఒక షరతు పెట్టాడు. ‘కానీ ఒక విషయం గుర్తుంచుకో. ఆ 100 ఒంటెలు ఒకేసారి కూర్చున్న తర్వాత మాత్రమే నువ్వు నిద్రపోవాలి.’ ఆ వ్యక్తి మనసులో నవ్వుకున్నాడు. ‘ఇదేనా పని? ఒంటెలను కూర్చోబెట్టడం పెద్ద కష్టమేమీ కాదు’ అనుకున్నాడు. అతను మాస్టర్ మాటకు అంగీకరించాడు. జెన్ మాస్టర్ తన గుడారంలోకి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి ఒంటెల దగ్గరకు వెళ్లాడు. మొదట అంతా చాలా సులభంగానే అనిపించింది. కొన్ని ఒంటెలు అప్పటికే కూర్చుని ఉన్నాయి. మరికొన్ని నిలబడి ఉన్నాయి. అతను నిలబడి ఉన్న ఒంటెలను కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కొంతసేపటికి ఒక ఒంటె కూర్చుంది. ‘అబ్బా! చాలా సులభమే’ అనుకున్నాడు. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి, అప్పటికే కూర్చున్న మరో ఒంటె లేచి నిలబడి ఉంది. అతను వెంటనే దాని దగ్గరకు పరుగెత్తాడు. దాన్ని కూర్చోబెట్టాడు. అంతలో మరో వైపు రెండు ఒంటెలు లేచి నిలబడ్డాయి. అతనికి చిరాకు మొదలైంది.

ఇవి కూడా చదవండి

ఒక ఒంటెను లాగాడు. మరో ఒంటెను నెట్టాడు. ఇంకొన్నింటితో మెల్లగా మాట్లాడాడు. మరికొన్నింటిపై కోపం చూపించాడు. కొన్ని ఒంటెలు అతని ప్రయత్నాలతో కూర్చున్నాయి. కొన్ని వాటంతట అవే కూర్చున్నాయి. కానీ కొన్ని మాత్రం ఎంత ప్రయత్నించినా కూర్చోలేదు. రాత్రి మరింత చీకటిగా మారింది. పట్టణంలోని ప్రజలంతా నిద్రపోయారు. కానీ ఆ వ్యక్తికి మాత్రం నిద్ర లేదు. ఎందుకంటే 100 ఒంటెలు ఒకేసారి కూర్చోలేదు. 90 ఒంటెలు కూర్చుంటే 10 నిలబడేవి. 95 కూర్చుంటే 5 లేచి నిలబడేవి. 99 ఒంటెలు కూర్చున్నప్పుడు ‘ఇంకా ఒక్కటే కదా.. ఇప్పుడు పని పూర్తవుతుంది’ అనుకునేవాడు. అంతలో ఎక్కడి నుంచో ఒక ఒంటె లేచి నిలబడేది! అతను దాని దగ్గరకు పరుగెత్తేవాడు. దాన్ని కూర్చోబెట్టేలోపే మరో ఒంటె లేచేది. ఇలా రాత్రంతా గడిచిపోయింది. అతని కాళ్లు నొప్పులతో నిండిపోయాయి. శరీరం అలసిపోయింది. కళ్లకు నిద్ర ముంచుకొచ్చింది. అయినా అతను ఆగలేదు. ఎందుకంటే అతని లక్ష్యం ఒక్కటే ‘100 ఒంటెలు ఒకేసారి కూర్చోవాలి’. కానీ ఆ రాత్రంతా ఒక్కసారి కూడా 100 ఒంటెలు ఒకేసారి కూర్చోలేదు.

మరుసటి ఉదయం జెన్ మాస్టర్ గుడారం నుంచి బయటకు వచ్చాడు. నేలపై అలసిపోయి, నిరాశగా కూర్చున్న ఆ వ్యక్తిని చూసి ‘మిత్రమా.. నిన్న రాత్రి బాగా నిద్రపోయావా?’ అని అడిగాడు. ఆ వ్యక్తి బాధగా నవ్వి ‘లేదు మాస్టర్. ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. నేను ఎంత ప్రయత్నించినా 100 ఒంటెలను ఒకేసారి కూర్చోబెట్టలేకపోయాను’ అన్నాడు. జెన్ మాస్టర్ చిరునవ్వుతో ‘అదే నీ ప్రశ్నకు సమాధానం’ అన్నాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా మాస్టర్ వైపు చూశాడు. మాస్టర్ ఇలా చెప్పాడు ‘నిన్న రాత్రి కొన్ని ఒంటెలు వాటంతట అవే కూర్చున్నాయి. కొన్ని నీ ప్రయత్నం వల్ల కూర్చున్నాయి. మరికొన్ని ఎంత ప్రయత్నించినా కూర్చోలేదు. కొంతసేపటి తర్వాత అవి కూడా వాటంతట అవే కూర్చున్నాయి. మన జీవితంలోని సమస్యలు కూడా ఇలాగే ఉంటాయి. కొన్ని సమస్యలు మన ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. కొన్ని సమస్యలు కాలం గడిచే కొద్దీ వాటంతట అవే పరిష్కారమవుతాయి. మరికొన్ని సమస్యలను మనం ఎంత ప్రయత్నించినా వెంటనే పరిష్కరించలేం. అలాంటి వాటిని కొంతకాలం కాలానికి వదిలేయాలి’ ఆ వ్యక్తి శ్రద్ధగా వింటున్నాడు. ‘అన్ని సమస్యలు ఒకేసారి ముగియవు’ జెన్ మాస్టర్ మళ్లీ చెప్పాడు ‘నిన్న రాత్రి నువ్వు ఒక ఒంటెను కూర్చోబెట్టినప్పుడు, మరో ఒంటె లేచి నిలబడింది కదా? జీవితంలో కూడా అంతే. నువ్వు ఒక సమస్యను పరిష్కరిస్తే మరో సమస్య రావచ్చు. ఉద్యోగంలో సమస్య పరిష్కారమైతే ఆరోగ్య సమస్య రావచ్చు. ఆరోగ్యం బాగుపడితే ఇంట్లో మరో సమస్య రావచ్చు. ఇంట్లో అంతా బాగుంటే ఆర్థిక సమస్య ఎదురుకావచ్చు. ఇలా సమస్యలు ఒక రూపంలో కాకపోతే మరో రూపంలో వస్తూనే ఉంటాయి.’

‘అయితే సమస్యలు ఎప్పటికీ ముగియవా?’ అని ఆ వ్యక్తి అడిగాడు. మాస్టర్ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు ‘జీవితం అంటే సమస్యలు లేని స్థితి కాదు. సమస్యలు ఉన్నప్పటికీ ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవడమే జీవితం.’ ఆ రోజు ఆ వ్యక్తికి ఒక గొప్ప విషయం అర్థమైంది. తన సమస్యల వల్ల మాత్రమే తాను అసంతృప్తిగా లేడు. తన జీవితంలోని అన్ని సమస్యలు ఒకేసారి పూర్తిగా ముగిసే రోజు కోసం ఎదురుచూస్తున్నందుకే అతను అసంతృప్తిగా ఉన్నాడు. కానీ అలాంటి రోజు ఎప్పటికీ రాదు. అందుకే జెన్ మాస్టర్ చివరిగా ఇలా చెప్పాడు ‘నువ్వు పరిష్కరించగల సమస్యను పరిష్కరించడానికి నీ వంతు ప్రయత్నం చేయి. వెంటనే పరిష్కరించలేని సమస్యను కొంతకాలం పక్కన పెట్టి ముందుకు సాగు. నీ చేతుల్లో లేని విషయాల గురించి నిరంతరం ఆలోచిస్తూ నీ ప్రస్తుత జీవితాన్ని నాశనం చేసుకోకు. నువ్వు చేయగలిగింది చేయి. నీ చేతుల్లో లేనిదాన్ని కాలానికి వదిలేయి. కానీ నీ జీవిత ప్రయాణాన్ని మాత్రం ఆపకు’ ఆ వ్యక్తి మాస్టర్‌కు నమస్కరించాడు. ఆ రోజు అతని సమస్యలు ఏవీ మాయమవ్వలేదు. కానీ సమస్యలను చూసే అతని దృక్పథం మాత్రం మారిపోయింది.

నీతి

కొన్ని సమస్యలు మన ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. కొన్ని సమస్యలు కాలంతో పరిష్కారమవుతాయి. మరికొన్ని సమస్యలను మనం అంగీకరించి ముందుకు సాగాల్సి ఉంటుంది. అన్ని సమస్యలు పూర్తిగా ముగిసిన తర్వాతే సంతోషంగా ఉంటానని ఎదురుచూస్తే, సంతోషంగా ఉండే అవకాశం ఎప్పటికీ రాకపోవచ్చు. సమస్యల మధ్య కూడా ప్రశాంతంగా జీవించడం నేర్చుకున్నప్పుడే నిజమైన శాంతి లభిస్తుంది.

Follow Us