AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్లో దక్కని గిట్టుబాటు ధర.. చేతికొచ్చిన కాలీఫ్లవర్ పంటను ట్రాక్టర్‌తో తొక్కించిన కౌలు రైతు!

ఎన్నో ఆశలతో రేయింబవళ్లు రెక్కలముక్కలు చేసుకుని సాగుచేసిన పంట చేతికొచ్చిన వేళ, మార్కెట్లో కనీస ధర కూడా లభించకపోవడంతో ఒక కౌలు రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పంటను మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అయ్యే రవాణా, కూలీ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో చేసేదేమీ లేక చేతికొచ్చిన కాలీఫ్లవర్ (గోబీ) పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.

మార్కెట్లో దక్కని గిట్టుబాటు ధర.. చేతికొచ్చిన కాలీఫ్లవర్ పంటను ట్రాక్టర్‌తో తొక్కించిన కౌలు రైతు!
Cauliflower Farmer
Naresh Gollana
| Edited By: |

Updated on: Sep 27, 2026 | 12:59 PM

Share

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామానికి చెందిన షేక్ రఫీక్ అనే రైతు రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని కాలీఫ్లవర్ సాగు చేశాడు. పంట బాగానే వచ్చినప్పటికీ, దానిని కోసి మార్కెట్‌కు తరలించే సమయంలో మార్కెట్లో ధరలు దారుణంగా పడిపోయాయి. వ్యాపారులు కిలో కాలీఫ్లవర్‌కు కేవలం రూ.3 నుండి రూ.4 మాత్రమే ఇస్తామని చెప్పారు. ఈ ధరతో పంట కోత కూలీలకు ఇచ్చే డబ్బులు, వాహన రవాణా ఛార్జీలు కూడా రావని గ్రహించిన ఆ రైతు, తీవ్ర నిస్సహాయ స్థితిలో తన రెండు ఎకరాల పంటను ట్రాక్టర్‌తో నేలమట్టం చేశాడు.

గత సంవత్సరం కాలీఫ్లవర్ పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంతో అన్ని ఖర్చులు పోను ఎకరాకు సుమారు రూ.1,50,000 వరకు లాభం వచ్చిందని రఫీక్ తెలిపాడు. ఆ ఆశతోనే ఈసారి కూడా ఎకరాకు దాదాపు రూ.70,000 వరకు పెట్టుబడి పెట్టి సాగుచేశానని చెప్పాడు. అయితే, ఈసారి ఆశించిన దిగుబడి రాకపోవడమే కాకుండా, వచ్చిన కొద్దిపాటి పంటకు కూడా మద్దతు ధర దక్కకపోవడంతో ఎకరాకు రూ.1,50,000 చొప్పున భారీగా నష్టం వాటిల్లిందని కన్నీటిపర్యంతమయ్యాడు.

పెట్టిన పెట్టుబడి మొత్తం పోవడమే కాకుండా, ఎకరాకు చెల్లించాల్సిన రూ.20,000 కౌలు భారం కూడా తన నెత్తిన పడిందని రైతు వాపోయాడు. అప్పులు తీర్చే దారి కనిపించక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయానని, మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల వల్ల నష్టపోయిన తమలాంటి కౌలు రైతులను ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us