యూట్యూబ్ సంపాదన చెప్పడమే ఆ యువకుడి తప్పైంది.. 48 గంటల్లోనే ఛానెల్ ఖతం!
సోషల్ మీడియా యుగంలో కంటెంట్ క్రియేటర్లు తమ నైపుణ్యంతో నెలకు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే, తమ ఆర్జనను బహిరంగంగా చూపిస్తూ అతిగా ప్రచారం చేసుకోవడం ఒక్కోసారి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతుంది. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన, చేదు అనుభవమే ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన యూట్యూబర్ వినీత్ యాదవ్‌కు ఎదురైంది. తన యూట్యూబ్ సంపాదనను ఇంటర్నెట్‌లో చెప్పిన సరిగ్గా 48 గంటల్లోనే అతనికి ఊహించని షాక్ తగిలింది..అసలేం జరిగిందంటే..

వినీత్ యాదవ్ వికె టెక్ డెమో అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఇటీవల అతడు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో తాను ప్రతి నెలా యూట్యూబ్ ద్వారా సుమారు రూ.2.5 లక్షల నుండి రూ.3 లక్షల వరకు ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా తన వద్ద ఉన్న కెమెరా, మైకులు, ల్యాప్‌టాప్ వంటి స్టూడియో పరికరాలను మరియు యూట్యూబ్ వల్ల తన జీవితం ఎలా మారిందో సంతోషంగా పంచుకున్నాడు. ఈ వీడియో స్వల్ప వ్యవధిలోనే నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.
48 గంటల్లోనే బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్:
వినీత్ తన ఆర్జన గురించి వీడియో విడుదల చేసిన సరిగ్గా రెండ్రోజులకు (48 గంటలు) అతనికి యూట్యూబ్ నుండి ఊహించని మెయిల్ వచ్చింది. అతని ఛానెల్ మానిటైజేషన్‌ను రద్దు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఛానెల్‌లో రీ-యూజ్డ్ కంటెంట్ లేదా నిబంధనల ఉల్లంఘన జరిగిందని యూట్యూబ్ స్పష్టం చేసింది. దాంతో అతని ఆదాయ మార్గం ఒక్కసారిగా మూతపడింది.
సహచరుల అసూయ, రిపోర్టులే కారణమా?
ఈ పరిణామంపై వినీత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన సంపాదన వీడియో చూసి తట్టుకోలేక చాలామంది అసూయతో తన ఛానెల్‌పై కావాలని పదే పదే రిపోర్టులు చేశారని అతడు ఆరోపిస్తున్నాడు. ఆ రిపోర్టుల ఆధారంగా యూట్యూబ్ అల్గారిథమ్ తప్పుడు నిర్ణయం తీసుకుని తన ఛానెల్‌ను డీమానిటైజ్ చేసిందని ఆవేదన చెందాడు.
డిజిటల్ క్రియేటర్లకు హెచ్చరిక:
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డిజిటల్ మాధ్యమాల్లో స్వయం సమృద్ధి సాధించడం మంచిదే అయినప్పటికీ, సంపాదనను అధికంగా ప్రదర్శించడం కొన్నిసార్లు ఇతర క్రియేటర్లు లేదా యూజర్ల అసూయకు కారణమై ఇబ్బందుల్లో పడేస్తుందని ఈ ఉదాహరణ నిరూపిస్తోంది. ప్రస్తుతం వినీత్ తన ఛానెల్ మానిటైజేషన్ పునరుద్ధరణ కోసం రీ-అప్పీల్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు.




