TGPSC Notification 2026: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాలు.. నిరుద్యోగులకు భారీ అవకాశం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, మెకానికల్, కెమికల్, బయో-టెక్నాలజీ, మైనింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు జూన్ 10 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు..

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ నెం. 02/OG/PC/2026 ద్వారా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో (Telangana Pollution Control Board) అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 10, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్, మెకానికల్, కెమికల్, బయో-టెక్నాలజీ, మైనింగ్ లేదా ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏఎంఐఈ (ఇండియా) సివిల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఏదైనా విభాగంలో బీటెక్/ బీఈ పూర్తి చేసి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్‌లో పీజీ అర్హత కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 2026 జులై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
ఈ అర్హతలు కలిగిన వారు జులై 17, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అమితు దరఖాస్తు చేసుకునే ముందుగా టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసి, అనంతరం లాగిన్ అయి దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,000 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించారు. దీనితోపాటు అదనంగా పరీక్ష ఫీజు రూ.120 ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBRT) లేదా OMR ఆధారిత పరీక్ష ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు వేతనం అందిస్తారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలను సెప్టెంబర్ 2026లో నిర్వహించనున్నారు.
రాత పరీక్ష విధానం..
రాత పరీక్ష రెండు పేపర్లకు మొత్తం 450 మార్కులకు నిర్వహించబడుతుంది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్‌కు 150 మార్కులు, సివిల్ ఇంజినీరింగ్ (డిగ్రీ స్థాయి)కు 300 మార్కులు కేటాయించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం, బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి.




