TGPSC Group 1 Mains Hall Tickets: టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల.. రేపు హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు సోమవారం (అక్టోబర్ 14) విడుదలకానున్నాయి. ఓ వైపు అభ్యర్ధులు మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు టీజీపీఎస్సీ వడివడిగా పరీక్షల నిర్వహనకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పరీక్షలకు ఏర్పాట్లు కూడా పూర్తిచేసింది. ఈ క్రమంలో మరికాసేపట్లో టీజీపీఎస్సీ హాల్‌టికెట్లను..
హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు సోమవారం (అక్టోబర్ 14) విడుదలయ్యాయి. ఓ వైపు అభ్యర్ధులు మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు టీజీపీఎస్సీ వడివడిగా పరీక్షల నిర్వహనకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పరీక్షలకు ఏర్పాట్లు కూడా పూర్తిచేసింది. ఈ క్రమంలో ఇవాళ టీజీపీఎస్సీ హాల్‌టికెట్లను విడుదల చేసింది. అభ్యర్ధులు తమ వివరాలను వెబ్ సైట్లో నమోదు చేసి, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరుగనున్నాయి. హైదరాబాద్ పరిధిలోనే ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే కమిషన్ స్పష్టం చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించిన కమిషన్ మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షలు మొత్తం 7 పేపర్లకు ఉంటాయి. తొలిరోజు పరీక్షకు తీసుకెళ్లిన హాల్ టిక్కెట్‌నే మిగిలిన ఆరు పరీక్షలకు తీసుకెళ్లాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. రోజుకో కొత్త హాల్ టిక్కెట్‌తో వెళితే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అలాగే ప్రతిపరీక్ష రోజు హాల్ టిక్కెట్‌పై ప్రతి అభ్యర్ధి తప్పనిసరిగా సంతకం చేయాలని తెలిపింది. నియామక ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ఈ హాల్ టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించింది.
మరోవైపు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును మంగళవారం వెల్లడించనుంది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచారణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ ‘కీ’లో తప్పులున్నట్టు తాము ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించామని, కాబట్టి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు భావిస్తుంటే.. మరోవైపు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని, వికీపీడియా, గూగుల్ ఆధారంగా ఫైనల్ ‘కీ’ని రూపొందించామని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలిపింది. ఇలా ఎవరి ధోరణిలో వాళ్లు తామే కరెక్ట్ అనేలా వాదోపవాదాలు వినిపించారు. ఇప్పటికే గ్రూప్ 1పై హైకోర్టులో 15కుపైగా కేసులు ఉన్నాయి. వీటిలో ఫైనల్ ‘కీ’పై వేసిన కేసు అత్యంత కీలకంగా మారింది.