TGPSC Group 1 Topper Journey: ‘అమ్మ మాటలే కొండంత స్ఫూర్తి..’ కూలి పనులు చేస్తూ గ్రూప్ 1లో మెరిసిన పేదింటి బిడ్డ!
కష్టం ఎవరికైనా కష్టం గానే ఉంటుంది. కొన్ని సార్లు ఆ కష్టం కళ్లల్లో కన్నీటికి బదులు రక్తాన్ని కారుస్తుంది. కానీ దేనికీ బెదరక అడుగులు ముందుకు వేసిన వారినే విజయం వరిస్తుంది. అలాంటి ఓ నిరుపేద విజయగాధ ఇది. తల్లిదండ్రులు కాలం చేస్తే.. తల్లి మాటలను గుండెల్లో ధైర్యంగా నింపుకుని దొరికిన పనల్లా చేసి కడుపునింపుకుంటూ గ్రూప్ 1లో ర్యాంక్ కొట్టాడీ ములుగు జిల్లా బిడ్డ..

టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దగ్గరున్న ఆకులవారిఘనపురంకు చెందిన దైనంపల్లి ప్రవీణ్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 105వ ర్యాంకు సాధించారు. చిన్న తనంలోనే కన్నోళ్లు కాలం చేసినా.. కష్టకాలంలో కన్నతల్లి మాటల్ని ఓదార్పుగా మార్చుకుని నానమ్మల సాయంతో లక్ష్యాన్ని సాధించిన నిరుపేద ప్రవీణ్ కుమార్ సక్సెజ్ జర్నీ ఎందరికో ఆదర్శం. చిన్న కష్టానికే కుంగి పోయే ఈ తరం యువతకు ఇలాంటి వారి జీవిత గాథలు ఎంతో స్ఫూర్తినిస్తాయి.
ప్రవీణ్ కుమార్ చిన్నతనం నుంచి చదువులో చురుకుగా ఉండేవారు. ఆరేళ్లు ఉన్నప్పుడే నాన్న అనారోగ్యంతో చనిపోతే.. అప్పట్నుంచి అమ్మే అన్నీ అయ్యింది. ఆమె గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలు. రోడ్లు ఊడ్చేది, మురికి కాలువలు శుభ్రం చేసేది. ఒక్కరోజు సెలవు దొరికినా వ్యవసాయ పనులకు వెళ్లేది. ఆ సంపాదనతో తనను, తమ్ముణ్ని, చెల్లిని చదివించేది. ఇంటర్ చదివే సమయంలో ఐఏఎస్ శంకరన్ గురించి తెలుసుకున్న ప్రవీణ్ ఆయన స్ఫూర్తితో తానూ కలెక్టర్ కావాలని అనుకున్నాడు. పేద, అట్టడుగు వర్గాల కోసం అవిరళ కృషి చేశారాయన. గురుకులాల ఏర్పాటు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. ఇలా చాలా వాటిలో ఆయన చొరవ ఉంది. సివిల్ సర్వెంట్ అయితే తానూ ఎందరికో సాయం చేయగలుగుతానన్న నమ్మకంతో అటుగా పయనం సాగించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత శంకరన్ చొరవతో ఏర్పాటైన తెలంగాణ ఎస్సీ స్టడీసర్కిల్‌లో కోచింగ్ కోసం చేరారు. అక్కడ తీసుకున్న కోచింగ్, చదివిన పుస్తకాలతోనే సివిల్స్‌లో రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. అయితే కొద్ది మార్కుల తేడాతో తన ఐఏఎస్ కల అందుకోలేకపోయారు. కానీ మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 1 సాధించారు.
‘బిడ్డా.. బాగా చదువుకో. లేకపోతే మాలాగే ఏ కూలీగానో, డ్రైవరుగానో మిగిలిపోతావు’ అని రోజూ రాత్రి పడుకునేముందు చెప్పేది. మాకోసం జీవితాన్నే ధారపోస్తున్న అమ్మకు చేదోడుగా ఉండాలని పేపర్ బాయ్‌గా చేరి చదువుకుంటూనే చిన్నచితక పనులు చేసుకుంటూ అమ్మకు సాయంగి నిలిచారు. ఓ వైపు చదువుతూనే దొరికిన పని చేసుకుంటూ కడుపు నింపుకున్నాడు. పూట గడవడానికి కూలి పనులకు సైతం వెళ్లాడు. అయితే కనికరించని కాలం ఆ తల్లిని కూడా 2013లో దూరం చేసింది. దీంతో కొన్నాళ్లు డిప్రెషన్‌లో ఉన్నా.. తల్లి చెప్పిన మాటలు పదేపదే గుర్తుకు తెచ్చుకుని నానమ్మలిద్దరూ సమ్మక్క, ఎల్లమ్మల ఆసరాతో మళ్లీ పుస్తకం పట్టారు. బాగా చదవాలంటే బాగా డబ్బులు ఉండాల్సిన అవసరం లేదని అర్ధం చేసుకుని ఉచితంగా చదువుకోవడానికి గురుకులాలు, యూనివర్సిటీలు స్కాలర్‌షిప్‌లు, స్టడీ సర్కిళ్ల సాయంతో ముందుకు సాగారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన ప్రవీణ్ కుమార్.. నాలుగేళ్లుగా బంజారాహిల్స్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉంటూ సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. ఇటీవల గ్రూప్ 1 పరీక్షలకు కూడా హాజరవగా.. తాజా ఫలితాల్లో ర్యాంకర్‌గా నిలిచారు.
ఇంటర్ ఫెయిలైన తమ్ముడిని మోటివేట్ చేయడంతో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ఇప్పుడు తనకు గ్రూప్స్ రావడంతో ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ప్రవీణ్. ఇప్పుడు ఐఏఎస్ కావాలన్న అమ్మ ఆశయం ఒక్కటే మిగిలి ఉందని, దానిని చేధిస్తానని నమ్మకంగా చెబుతున్నారు. ప్రవీన్ కల నెరవేరాలని మనం అందరం కోరుకుందాం..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.



