TG GPO Exam Date 2025: గ్రామ పాలనాధికారుల పోస్టులకు రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయనున్న గ్రామ పాలనాధికారుల నియామకం పరీక్ష తేదీ విడుదలైంది. ఈ పరీక్షను మే 25న నిర్వహించనున్నట్లు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ఓ ప్రకటనలో తెలిపారు. తాజా ప్రకటన మేరకు ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా..

హైదరాబాద్, మే 20: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయనున్న గ్రామ పాలనాధికారుల నియామకం పరీక్ష తేదీ విడుదలైంది. ఈ పరీక్షను మే 25న నిర్వహించనున్నట్లు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ఓ ప్రకటనలో తెలిపారు. మే 25న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వివరాలను అధికారిక సీసీఎల్ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. అలాగే ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను కూడా విడుదల చేశామని, వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. జీపీవోల నియామకంలో భాగంగా పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏలకు ఐచ్ఛికం కింద అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 6196 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ అర్హత పరీక్షను మే 25న జరగనుంది.
తొలిసారి కేరళలో టెన్త్ విద్యార్థులకు రోబోటిక్స్ విద్య
దేశంలో పదో తరగతి విద్యార్థులకు రోబో టిక్స్ విద్యను తప్పనిసరిగా అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో దీన్ని అమలు చేయనున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేకించి పదో తరగతి ఐసీటీ పుస్తకంలో ఆరో చాప్టర్లో ‘ది వరల్డ్ ఆఫ్ రోబోట్స్’ పేరుతో రోబోటిక్స్ విద్యకు సంబంధించిన ప్రాథమిక అంశాలను బోధించనున్నట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులకు సర్క్యూట్ కన్‌స్ట్రక్షన్, సెన్సర్లను వినియోగించడం, ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించడం వంటి రోబోటిక్స్ విద్యను నేర్చుకోనున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే 9,924 మంది ప్రభుత్వ టీచర్లకు తొలి దశ కింద శిక్షణ ఇచ్చారు. 29 వేల రోబోటిక్ కిట్లనూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత పాఠశాలలకు అందజేశామని కేరళ సాంకేతిక విద్యా సంస్థ (కెఐటీఈ) సీఈహో కే అన్వర్ సాదత్ తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




