Telangana: నిరుద్యోగులకు భలే ఛాన్స్.. రూ.6 లక్షల వరకు సర్కార్ సాయం! రేపట్నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ యువతకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగులకు ఆర్ధిక సాయం అందించేందుకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 17 నుంచి ప్రారంభించనుంది. ఈ పథకం కింద స్వయం ఉపాధి రుణాలు రూ.6 కోట్ల వరకు మంజూరు చేస్తారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఎవరైనా..

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆర్ధిక సాయం అందించేందుకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం కింద స్వయం ఉపాధి రుణాలు రూ.6 కోట్ల వరకు మంజూరు చేస్తారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఎవరైనా ఏప్రిల్ 5, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు లబ్ధి పొందవచ్చు. ఈ ఏడాదికి రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది యువతకు రూ.6 వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వం రాయితీ రుణాలను ఈ పథకం కింద మంజూరు చేయనుంది.
ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈ మేరకు బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యబట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఐటీడీఏ అధికారుల్ని సంప్రదించాలని గిరిజన సహకార ఆర్థిక సంస్థ జీఎం శంకర్‌రావు తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు కేటగిరీ 1, 2, 3వారీగా రుణాలు ఖరారు చేస్తారు. కేటగిరీ 1 కింద రూ.లక్ష వరకు రుణాలు అందిస్తారు. ఇందులో 80 శాతం రాయితీ ఉంటే, మిగతా 20 శాతం లబ్ధిదారు భరించడమో లేదా బ్యాంకు అనుసంధానం యూనిట్లు చెల్లించడమో జరుగుతుంది. ఇక కేటగిరీ 2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఇందులో 70 శాతం రాయితీ ఉంటుంది. కేటగిరీ 3 కింద 60 శాతం రాయితీతో రూ.3 లక్షలలోపు రుణాలు ఇస్తారు.
ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. లబ్ధిదారుల్లో అర్హులను ఎంపికచేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అంటే జూన్ 2న లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందజేస్తారు. ఇతర వర్గాలకు కూడా ఈ పథకాన్ని భవిష్యత్తులో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




