DOST 2025 Admissions: ఇరకాటంలో ‘దోస్త్’ ఆన్‌లైన్ వ్యవస్థ.. కన్వినర్ నియామకం ఇంకెప్పుడో?
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే ‘దోస్త్’ ఆన్‌లైన్ విధానం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు పూర్తవగా ఇంతవరకూ దోస్త్ కన్వినర్ నియామకం చేపట్టకపోవడమే అందుకు కారణం. దీంతో 2025-26 డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు సకాలంలో మొదలవుతాయో.. లేదో..అని పలువురు తలలు పట్టుకుంటున్నారు..

హైదరాబాద్, మార్చి 24: యేటా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే ఏకీకృత ఆన్‌లైన్ వ్యవస్థ ‘దోస్త్’ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు పూర్తవగా ఇంతవరకూ దోస్త్ కన్వినర్ నియామకం చేపట్టకపోవడమే అందుకు కారణం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ కళాశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రవేశపెట్టిందే ‘దోస్త్’. దీనిపై మొదట్నుంచీ ఉన్నత విద్యా మండలిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని కొందరు ఉన్నతాధికారులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ఇందులో మార్పులు తేవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ విధానం ఎత్తివేస్తే బాగుంటుందనే వాదనలూ లేకపోలేదు. ఇప్పటి వరకు కన్వినర్‌ను నియమించకపోవడంపై మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. దోస్త్‌లో కొన్ని మార్పులు అవసరమని, ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరిస్తామని అన్నారు.
‘దోస్త్’ను 2016–17 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ విధానంలో ఒకే ఒక్క దరఖాస్తుతో రాష్ట్రంలోని ఏ కాలేజీలోనైనా మెరిట్ ప్రకారం డిగ్రీలో ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. అయితే గతంలో ప్రతి కాలేజీకి విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. దరఖాస్తు ఫీజు కూడా విడివిడిగానే చెల్లించాలి. కానీ ‘దోస్త్’ అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం రూ. 200 ఫీజుతో అన్ని కాలేజీలకు ఒకేసారి అప్లై చేసుకునే వెసులుబాటు లభించింది. ఆన్‌లైన్ పోర్టల్‌తో పాటు మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చారు. దీంతో విద్యార్థులు సులభంగా, తక్కువ ఖర్చుతో డిగ్రీ ప్రవేశాలు పొందే అవకాశం చిక్కింది. అయితే ఇది పూర్తిగా ఆన్‌లైన్ వ్యవస్థ కావడంతో మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవగాహన లేమివల్ల దరఖాస్తులు నింపడంలో పొరపాట్లు దొర్లుతున్నాయి. అంతేకాకంఉడా మెరిట్ ప్రకారం సీట్ల కేటాయింపు ఉండటంతో విద్యార్ధులు కొందరికి దూరంగా ఉన్న కాలేజీల్లో సీట్లు వస్తున్నాయి. దీంతో సీటు వచ్చినా విద్యార్ధులు చేరడం లేదు. ఇంకోవైపు ప్రైవేటు కాలేజీలు ముందే విద్యార్థుల చేత తమ కాలేజీలో చేరేలా ప్రాధాన్యత ఆప్షన్లు పెట్టిస్తున్నాయి. ఈ కారణాల వల్ల ‘దోస్త్’ప్రవేశాల ప్రక్రియను పలు దఫాలుగా నిర్వహిస్తున్నారు. దీంతో అకడమిక్ సంవత్సరం చాలా ఆలస్యమవుతోంది.
రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 3.90 లక్షల మంది ఇంటర్ పాసవుతున్నారు. వీరిలో 45 శాతం మంది మాత్రమే డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. కానీ రాష్ట్రంలో 1,055 కాలేజీల్లో 4.62 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులంతా డిగ్రీలో చేరినా ఇంకా 70 వేలకుపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. 416 గ్రామీణ కాలేజీల్లో ప్రవేశాలు 30 శాతం మించడం లేదు. వంద కాలేజీల్లో కొన్ని బ్రాంచీల్లో జీరో అడ్మిషన్లు నమోదవుతున్నాయి. ‘దోస్త్’జాబితాలో ఉన్న కాలేజీల్లో డిగ్రీకి రూ.5 వేల నుంచి రూ.12 వేల వరకు ఫీజులుంటే.. అందులో లేని 60 కాలేజీలు మాత్రం రూ.1.25 లక్షల వరకు ఫీజులు గుంజుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాణ్యత లేని కాలేజీల్లో గత ఏడాది లక్షకుపైగా సీట్లు తగ్గించారు. దీంతో ‘దోస్త్’ఎత్తివేయాలని, ఫీజులు, ప్రవేశాలపై తమకు స్వేచ్ఛ ఇవ్వాలని ప్రైవేటు కాలేజీలు గగ్గోలు పెడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ‘దోస్త్’ ఎత్తివేయడమా లేదంటే ఆన్‌లైన్ విధానం కొనసాగించి అవసరమైన మార్పులు చేయడమా అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.