Diplomas Equivalent to Intermediate: ‘ఇంటర్మీడియట్‌కు డిప్లొమా కోర్సు సమానమే.. ఆ విద్యార్ధికి సీటు ఇవ్వండి’ హైకోర్టు ఆదేశం
Telangana High Court says Diplomas Equivalent to Intermediate: డీసెట్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) కన్వీనర్ అందించే డిప్లొమా ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కోర్సును ఇంటర్మీడియట్‌తో సమానంగా అంగీకరించలేదని, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ కోసం తన దరఖాస్తును తిరస్కరించారని కాంపెల హరీష్ దాఖలు చేశారు..

హైదరాబాద్, జులై 6: తెలంగాణ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అందించే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వంటి రెండేళ్ల డిప్లొమా కోర్సులు ఇంటర్మీడియట్ కోర్సులకు సమానమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌కు డిప్లొమా కోర్సు సమానమేనని కోర్టు వెల్లడించింది. రాష్ట్రం అందించే కోర్సులను గుర్తించడంలో ప్రభుత్వ శాఖలు వేర్వేరు ప్రమాణాలను తీసుకోలేవని కోర్టు పేర్కొంది. అసలేం జరిగిందంటే..
డీసెట్ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) కన్వీనర్ అందించే డిప్లొమా ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కోర్సును ఇంటర్మీడియట్‌తో సమానంగా అంగీకరించలేదని, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ కోసం తన దరఖాస్తును తిరస్కరించారని కాంపెల హరీష్ దాఖలు చేశారు. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన తనను ఇంటర్మీడియట్ అర్హత లేనందున కౌన్సెలింగ్ సీటు ఇవ్వడాన్ని నిరాకరించినట్ల పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ కె. లక్ష్మణ్ విచారించారు. పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ కుమార్ పానుగంటి వాదనలు వినిపిస్తూ.. బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ జారీ చేసిన అక్టోబర్ 27, 2001 నాటి జీఓ 112 ప్రకారం డిప్లొమా ఇంటర్మీడియట్ కోర్సుతో సమానమని పేర్కొన్నట్లు తెలిపారు. పిటిషనర్ డీఈఈ కోర్సు ఎంట్రన్స్‌లో ర్యాంకు పొందారని, సర్టిఫికెట్‌ల ధ్రువీకరణకు వెళితే ఇంటర్మీడియట్ కోర్సు లేదంటూ నిరాకరించారన్నారు. ఉన్నత విద్య తరపు ప్రభుత్వ న్యాయవాది కూడా ఈ కోర్సు ఇంటర్మీడియట్ కోర్సుతో సమానంగా ఉందని అన్నారు.
అయితే పాఠశాల విద్యా శాఖ తరపు న్యాయవాది దీనిని విభేదిస్తూ సాంకేతిక విద్యా మండలి అందించే డిప్లొమా కోర్సులో తెలుగు లేదా ఇంగ్లీష్ వంటి భాషలు లేవని వాదించారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా ప్రీ-స్కూల్ విద్యలో ప్రవేశానికి భాషల అధ్యయనం అవసరమన్నారు. డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పదవికి అర్హులు అవుతారని, వారు భాషలను అధ్యయనం చేయకుండా విద్యార్థులకు బోధించలేరని వాదించారు. కోర్టు ఆ వాదనను ఖండించింది. 2001లో ప్రభుత్వమే GO జారీ చేసినప్పుడు ఎవరైనా దానికి విరుద్ధంగా ఎలా వెళ్లగలరని కోర్టు ప్రశ్నించింది. డిప్లొమా జారీ చేసిన సాంకేతిక బోర్డు.. అది ఇంటర్మీడియట్‌కు సమానమైన కోర్సుగా పేర్కొంది. అందువల్ల డీఈఈసెట్‌లో ఇంటర్ అర్హత లేదని ప్రవేశం నిరాకరించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన సదరు విద్యార్ధికి అడ్మిషన్ ఇవ్వాలని కన్వీనర్‌ను కోర్టు ఆదేశించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.