AP EAPCET 2025 Counselling: రేపట్నుంచే ఈఏపీసెట్ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఈఏపీసెట్ కౌన్సెలింగ్ సోమవారం (జులై 7) నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపులు..

అమరావతి, జులై 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఈఏపీసెట్ కౌన్సెలింగ్ సోమవారం (జులై 7) నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపులు జులై 7 నుంచి 16వ తేదీ వరకు ఉంటాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 17వ తేదీ వరకు ఉంటుంది. ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ఎంపికకు నిర్వహించే ఈఏపీసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు జులై 13 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. వెబ్ ఆప్షన్లలో మార్పుకు జులై 19న అవకాశం ఇస్తారు.
జులై 22వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 23 నుంచి 26వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇక తరగతులు ఆగస్టు 4, 2025వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. కాగా మొదట ప్రకటించిన షెడ్యూల్ మేరకు వెబ్ కౌన్సెలింగ్ నమోదు జులై 10న జరగాల్సి ఉండగా దాన్ని జులై 13కు మార్చారు. ప్రవేశాల ప్రకటనను శనివారానికి బదులు ఆదివారానికి మార్చారు. ఇంజినీరింగ్ కళాశాలలకు గుర్తింపు అనుమతుల్లో జాప్యం నెలకొనడంతో ఉన్నత విద్యా మండలి వెబ్ ఐచ్ఛికాల నమోదు షెడ్యూల్‌ను మార్చింది.
జులై 7న తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలను సోమవారం (జులై 7) విడుదల చేయనున్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రవి రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సమాచారం అందించారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ నుంచి స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.