AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ బడి విద్యార్థులకు బంపర్ గిఫ్ట్.. ఈ ఏడాది నుంచి భారీ మార్పులు!

వచ్చే సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బడులు ప్రారంభం కానున్నాయి. దీంతో జూన్‌ 15 నుంచి 2026-27 విద్యా సంవత్సరం మొదలవనుంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోంది..

ప్రభుత్వ బడి విద్యార్థులకు బంపర్ గిఫ్ట్.. ఈ ఏడాది నుంచి భారీ మార్పులు!
New Facilities And Welfare Schemes For Govt Schools
Srilakshmi C
|

Updated on: Jun 12, 2026 | 4:19 PM

Share

హైదరాబాద్‌, జూన్‌ 12: పేద విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను గణనీయంగా పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. జూన్ 15న రాష్ట్రంలోని పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాదితో పోలిస్తే కనీసం 10 శాతం మేర అడ్మిషన్లు పెంచాలని ఉపాధ్యాయులకు లక్ష్యాలను నిర్దేశించింది.

ఈ విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రత్యేక వర్క్‌బుక్స్ అందించనున్నారు. అలాగే రాష్ట్రంలోని 9 వేల ప్రభుత్వ పాఠశాలలకు ఆగస్టు నాటికి హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు.. ప్రతిరోజూ అల్పాహారం, వారానికి మూడు రోజుల పాటు నాణ్యమైన పాలను కూడా అందించనున్నారు. పాఠశాలలు ప్రారంభమైన రోజునే యూనిఫాంలు, బూట్లు, బెల్టులు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వాటి పంపిణీలో స్వల్ప ఆలస్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించనున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ ఇప్పటికే పాఠశాలలకు చేరవేసినట్లు అధికారులు తెలిపారు.

గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 20 వేల మేర తగ్గింది. 2024-25లో 16.78 లక్షల మంది విద్యార్థులు ఉండగా, 2025-26 నాటికి ఆ సంఖ్య 16.58 లక్షలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో కనీసం 10 శాతం మేర చేరికలు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే దాదాపు 1.65 లక్షల మంది కొత్త విద్యార్థులు చేరితేనే లక్ష్యం నెరవేరుతుంది. ఈసారి రాష్ట్రంలోని 2,769 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించనున్నందున 30 వేల నుంచి 40 వేల మంది చిన్నారులు కొత్తగా చేరే అవకాశం ఉందని అంచనా. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలనే సర్కార్ తాపత్రయం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అధికమవుతున్నాయి. సమగ్ర శిక్ష, హెచ్‌సీయూ, యునిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో 25 శాతం మంది ఉపాధ్యాయులు బోధనకు సగం లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే కేటాయించగలుగుతున్నట్లు వెల్లడైంది. దసరా సెలవుల నాటికి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను పూర్తిచేసి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో బోధనపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంకా ఎదురవుతున్న సవాళ్లు

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతున్నప్పటికీ విద్యార్థుల చేరికలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంన్నాయి. ఉపాధ్యాయుల కొరత పలు బడుల్లో కొనసాగుతుంది. రాష్ట్రంలో సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో కేవలం 16 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. మరోవైపు కేవలం 12 వేల ప్రైవేటు పాఠశాలల్లోనే 35 లక్షలకుపైగా విద్యార్థులు చదవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం నెలకు సగటున రూ.9 వేల వరకు, ఏడాదికి రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్న ఫలితాలు అరకొరగా ఉంటున్నాయి. ఎన్ని సంక్షేమ చర్యలు చేపట్టిన విద్యార్ధుల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడుల పట్ల నమ్మకం పెరగడం లేదు.

Follow Us