TG 10th Exam Fee 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫీజుకు సంబంధించి తాజా ఆప్‌డేట్ ఇదే
Telangana revises SSC public exam fee deadlines for 2026: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుల గడువు తేదీని పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు పీవీ శ్రీహరి ప్రకటన వెలువరించారు. గతంలో ఇచ్చిన ప్రకటన మేరక ఎలాంటి..

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుల గడువు తేదీని పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు పీవీ శ్రీహరి ప్రకటన వెలువరించారు. గతంలో ఇచ్చిన ప్రకటన మేరక ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 13, 2025వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. అయితే తాజా ప్రకటన మేరకు ఈ గడువును నవంరబ్ 20వ తేవీ వరకు పొడిగించారు. ఆ మేరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపుల గడువును వారం పాటు పెంచినట్లు ఆయన తెలిపారు.
ఇక రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 21 నుంచి 29 వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించింది. రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 11 వరకు అవకాశం ఇచ్చింది. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 29 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరోవైపు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించిన విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే అదే తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు సరిగ్గా మార్చి 18వ తేదీనే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు కూడా ముగియనున్నాయి. ఇక టెన్త్ పరీక్షలు ప్రారంభమైన వెంటనే మధ్యలో శ్రీరామనవమి పండగ వస్తుంది. దీంతో మార్చి 26, 27 ఏదైనా ఒక తేదీలో శ్రీరామనవమి సెలవు రానుంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే నేడో, రేపో టెన్త్ పరీక్షల పూర్తి టైం టేబుల్ విడుదల చేయనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




