AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మూడో అటెంప్ట్‌కు సుప్రీంకోర్టు నో.. అందోళనలో విద్యార్ధులు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 మూడో అటెంప్ట్ కు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లను విచారించిన ధర్మాసనం ఈ పిటీషన్లను కొట్టివేసింది. జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు (జేఏబీ) నిర్ణయంపై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే 2024 నవంబర్‌ 5 నుంచి 18 తేదీల మధ్య కాలంలో తమ కోర్సుల నుంచి డ్రాప్‌ అవుట్‌ అయిన విద్యార్థులకు మాత్రం బిగ్ రిలీఫ్ ఇచ్చారు..

JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మూడో అటెంప్ట్‌కు సుప్రీంకోర్టు నో.. అందోళనలో విద్యార్ధులు
JEE Advanced 2025 3rd Attempt
Srilakshmi C
|

Updated on: Jan 12, 2025 | 10:46 AM

Share

న్యూఢిల్లీ, జనవరి 12: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్, బీఆర్క్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష యేటా మూడుసార్లు రాసుకోవడానికి సుప్రీం కోర్టు నో చెప్పింది. గతంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్షను ప్రతీయేట మూడు సార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించిన జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు (జేఏబీ).. ఆ తర్వాత ఈ నిర్ణయంపై యూటర్న్‌ తీసుకుని రెండు సార్లకే పరిమితం చేస్తూ ప్రకటన జారీ చేసింది. దీనిపై పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జనవరి 10న సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను రెండుసార్లు రాసేలా జేఏబీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఐఐటీ కాన్పూర్‌ ప్రకటన నేపథ్యంలో 2024 నవంబర్‌ 5 నుంచి 18 తేదీల మధ్య కాలంలో తమ కోర్సుల నుంచి డ్రాప్‌ అవుట్‌ అయిన విద్యార్థులకు ఉపశమనం కలిగించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్షకు వారు రిజిస్టర్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను మూడుసార్లు రాసే అవకాశం కల్పిస్తున్నట్లు నవంబర్‌ 5న ఐఐటీ కాన్పూర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదే నెల18వ తేదీన జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు (జేఏబీ) యూటర్న్‌ తీసుకుని రెండు సార్లకే పరిమితం చేస్తూ ప్రకటన జారీ చేసింది. దీంతో పలువురు అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల అర్హత ప్రమాణాల్లో చేసిన ఆకస్మిక మార్పుల వల్ల వేలాది విద్యార్ధులు నష్టపోతున్నారని, ఈ నిర్ణయం ఐఐటీల్లో ప్రవేశించే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపారు.

కాగా ఐఐటీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పేరిట ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష రాయాలంటే ఇంటర్‌ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాదితో కలిపి.. వరుసగా రెండుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని మూడుసార్లకు పెంచుతూ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ కాన్పుర్‌ గతేడాది నవంబర్‌ 5వ తేదీన ప్రకటించింది. అయితే పట్టుమని 15 రోజులు కాకముందే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో గతంలో మాదిరిగానే రెండుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. వచ్చే మే నెలలో జరిగే అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 2024 మార్చి, 2025 మార్చిలో జరిగే ఇంటర్‌ పరీక్షల్లో పాసైనవారు మాత్రమే అర్హులుగా ఉండనున్నారు. అంతకంటే ముందు ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారికి ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉండదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.