RRB NTPC Railway Jobs 2025: సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?
RRB NTPC Graduate Recruitment 2025 application last date: దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఈ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తులు నేటితో ముగియనుంది...

హైదరాబాద్, నవంబర్ 20: దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఈ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తులు నేటితో ముగియనుంది. అంటే నవంబర్ 20, 2025వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే తాజాగా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్) పోస్టుల దరఖాస్తు గడువును రైల్వే బోర్డు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ ప్రకటన మేరకు నవంబర్ 20తో దరఖాస్తు గడువు ముగుస్తుండగా దానిని నవంబర్ 27వ తేదీ వరకు పొడిగించింది. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 9వరకు అవకాశం కల్పించింది.
కాగా 2025 సంవత్సరానికి సంబంధించి ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ మొత్తం 5,810 గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి గత అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. టైర్ 1, టైర్ 2 రాత పరీక్షల అనంతరం టైపింగ్ స్కిల్ టెస్ట్, ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్ పోస్టులకు నెలకు రూ.35,400, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500, ఇతర పోస్టులకు రూ.29,200 చొప్పున జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లు చెల్లిస్తారు.
ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు ఇలా..
- అహ్మదాబాద్‌లో పోస్టుల సంఖ్య: 79
- అజ్‌మేర్‌లో పోస్టుల సంఖ్య: 345
- బెంగళూరులో పోస్టుల సంఖ్య: 241
- భువనేశ్వర్‌లో పోస్టుల సంఖ్య: 231
- బిలాస్‌పూర్‌లో పోస్టుల సంఖ్య: 864
- చండీగఢ్‌లో పోస్టుల సంఖ్య: 199
- చెన్నైలో పోస్టుల సంఖ్య: 187
- గువాహటిలో పోస్టుల సంఖ్య: 56
- గోరఖ్‌పుర్‌లో పోస్టుల సంఖ్య: 111
- జమ్ము & శ్రీనగర్లో పోస్టుల సంఖ్య: 32
- కోల్‌కతాలో పోస్టుల సంఖ్య: 685
- మాల్దాలో పోస్టుల సంఖ్య: 522
- ముంబయిలో పోస్టుల సంఖ్య: 596
- ముజఫర్‌పూర్‌లో పోస్టుల సంఖ్య: 21
- పట్నాలో పోస్టుల సంఖ్య: 23
- ప్రయాగ్‌రాజ్‌లో పోస్టుల సంఖ్య: 110
- రాంచీలో పోస్టుల సంఖ్య: 651
- సికింద్రాబాద్‌లో పోస్టుల సంఖ్య: 396
- సిలిగురిలో పోస్టుల సంఖ్య: 21
- తిరువనంతపురంలో పోస్టుల సంఖ్య: 58
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








