NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్ విడుదల
దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2026 (NEET UG 2026) ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టి పూర్తిగా కౌన్సెలింగ్ ప్రక్రియపైకి మళ్లింది. ఈ నేపథ్యంలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) త్వరలోనే NEET UG Counselling 2026 షెడ్యూల్‌ను ప్రకటించనుంది..

హైదరాబాద్, జులై 23: నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 15 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ) సీట్లతో పాటు సెంట్రల్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ఎయిమ్స్ (AIIMS), జిప్‌మర్ (JIPMER) వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలోని సీట్ల భర్తీని ఎంసీసీ నిర్వహించనుంది. మిగిలిన 85 శాతం స్టేట్ కోటా సీట్లను ఆయా రాష్ట్రాల కౌన్సెలింగ్ అధికారులు భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లైన neet.nta.nic.in లేదా mcc.nic.inలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.
కొత్తగా 9,911 ఎంబీబీఎస్ సీట్లు
జాతీయ వైద్య కమిషన్ (NMC) విడుదల చేసిన తాజా సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా 9,911 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొత్తం 823 వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,36,939కు పెరిగింది. ఈ పెరుగుదలతో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు తమ నీట్ స్కోర్ కార్డులు, కటాఫ్ మార్కులు, గత సంవత్సరాల అడ్మిషన్ ట్రెండ్స్ ఆధారంగా తమ ప్రవేశ అవకాశాలను అంచనా వేసుకుంటున్నారు.
కాలేజీ ఎంపికలో జాగ్రత్త అవసరం
కౌన్సెలింగ్ సమయంలో కాలేజీ ఎంపిక అత్యంత కీలకంగా మారనుంది. విద్యార్థులు తమ ర్యాంకు, సీట్ల లభ్యత, ఫీజు నిర్మాణం, అకడమిక్ ప్రతిష్ఠ, మౌలిక సదుపాయాలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు వంటి అంశాలను పరిశీలించి ఎంపికలు నమోదు చేయాలి. ముఖ్యంగా NIRF Rankings 2025లో టాప్ స్థానాల్లో నిలిచిన మెడికల్ కాలేజీలకు అధిక డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
నీట్ మూల్యాంకనంపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన NTA
NEET UG 2026 ఫలితాల్లో తప్పులు జరిగాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఓఎంఆర్ (OMR) షీట్లు డిజిటల్ మార్పిడి, కృత్రిమ మేధ (AI) సాంకేతికత సహాయంతో తయారు చేసిన నకిలీ పత్రాలని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును పునఃపరిశీలించామని, అధికారిక రికార్డులు మరియు ప్రకటించిన ఫలితాలు 100 శాతం సరిపోలినట్లు నిర్ధారించామని పేర్కొంది. ఫలితాల మూల్యాంకనంలో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. ఫోర్జరీ, నకిలీ ఓఎంఆర్ షీట్లను సృష్టించడం, సమర్పించడం, సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడం ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024’, ‘భారతీయ న్యాయ సంహిత (BNS)’, ‘ఐటీ యాక్ట్’ కింద తీవ్రమైన నేరమని ఎన్‌టీఏ హెచ్చరించింది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలకు ముందే విద్యార్థులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని, అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది.
