Mega DSC 2025 Notification: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే సిద్ధం చేయండి.. మంత్రి లోకేశ్ ఆదేశం
నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ విడుదలకు వెంటనే ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడనుంది..

అమరావతి, ఏప్రిల్ 9: ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో గుడ్‌న్యూస్ చెప్పారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు ప్రారంభమైనాయి. తాజాగా విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డీఎస్సీ, పది, ఇంటర్మీడియట్ ఫలితాలు, డ్యాష్ బోర్డు రూపకల్పనపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డీఎస్సీ ప్రకటనకు ఏర్పాట్లు చేయాలన్నారు. పది, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టెన్త్, ఇంటర్ ఫలితాలను ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘మనమిత్ర’ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జీఓ-117కు ప్రత్యామ్నాయ జీఓను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలన్నారు. పాఠశాలలు తెరిచేనాటికే పాఠ్యపుస్తకాలు సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే 48 శాతం పుస్తకాల ముద్రణ పూర్తైనట్లు అధికారులు మంత్రికి తెలిపారు. అలాగే టీచర్ల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అమరావతిలో కేంద్రీయ గ్రంథాలయం, శిక్షణ అకాడమీ, మ్యూజియం నిర్మాణాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేసవి సెలవులో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లోని టీచర్ల బదిలీలను పూర్తి చేసేందుకు మంత్రి లోకేష్ అనుమతి తెలిపారు.
మొత్తం జూన్ నాటికి విద్యాశాఖలో సంస్కరణలు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




