Inter Re-evaluation 2025: ఇంటర్ మూల్యాంకనంలో నయా ప్లాన్.. ఒక సబ్జెక్టులో ఫెయిలైతే..!
ఇంటర్ బోర్డు విద్యార్ధుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సరికొత్త ప్లాన్ ను అమలు చేస్తుంది. గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకుని ఒక్క విద్యార్ధికి కూడా నష్టం జరగకూడదని ఫలితాలకు ముందే రీవాల్యుయేషన్ అమలు చేస్తుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఇక ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే..

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇంకా కొనసాగుతుంది. రాష్ట్రంలో 19 సెంటర్లల్లో మార్చి 19 నుంచి మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమవగా.. ఏప్రిల్ 10వ తేదీతో ముగియనుంది. అయితే ఈ సారి ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో తప్పులు చోటుచేసుకోకుండా ఇంటర్ బోర్డు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా నూతన విధానాన్ని అమలు చేయనుంది. అదేంటంటే.. విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిన తర్వాత ఆ పేపర్లను మరోసారి చెక్ చేయనుంది. ఫలితాలు కాస్త ఆలస్యమైనా పర్వాలేదు సరైన ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి3 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మూల్యాంకనం పూర్తైన తర్వాత ఈ నెలాకరుకి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అదే రోజు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్‌కు సంబంధించిన వివరాలు కూడా వెల్లడిస్తారు.
సాధారణంగా యేటా సుమారు 50 వేల మంది విద్యార్ధులు ఫీజు చెల్లించి రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రక్రియలో చాలా మందికి మార్కులు కూడా యాడ్ అవుతున్నాయి. గతంలో ఓ విద్యార్ధికి 99 మార్కులు వస్తే సున్నా మార్కులు వేయడంతో అప్పట్లో పెద్ద గందరగోళమే జరిగింది. అలాగే ఫెయిల్ అయిన విద్యార్ధులు కూడా పలువురు రీ వాల్యుయేషన్‌లో పాసయ్యారు. వీటన్నింటి దృష్ట్యా ఈసారి ఇంటర్ బోర్డు ఇలాంటి తప్పిదాలు జరగకూడదని మూల్యంకనం ప్రక్రియనే మరోమారు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంటే వాల్యుయేషన్ పూర్తయిన జవాబు పత్రాలనే రీ వాల్యుయేషన్ చేయించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
అయితే సుమారు పది లక్షల మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లను ఇలా రీ వాల్యుయేషన్ చేయడం అంత సులువేంకాదు. ఇందుకు ఇంటర్‌బోర్డు మరో ప్లాన్ అమలు చేస్తుంది. స్టూడెంట్లకు వచ్చిన మార్కుల్లో ఐదు స్లాట్లలో ర్యాండమ్ చెకింగ్ చేసి, జీరో మార్కులు, 1 నుంచి పది మార్కులు, 25 నుంచి 35 మార్కులు, 60 నుంచి 70 మార్కులు, 95 మార్కుల నుంచి 99 మార్కులు వచ్చిన విద్యార్ధుల మార్కులను ఎంపిక చేసి, వాటన్నింటికీ రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 19 స్పాట్ కేంద్రాల్లో మంగళవారం (ఏప్రిల్ 8) నుంచి ప్రారంభమైంది. మూడు రోజుల్లో దీన్ని పూర్తి చేసి, మరో మూడు రోజులపాటు ర్యాండమ్ ఆన్సర్ షీట్లను రీ వాల్యుయేషన్ చేయనున్నారు.
వీటితో పాటు అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులతో పాసై.. ఒక సబ్జెక్టులో ఫెయిలైతే ఆ సబ్జెక్ట్ ఆన్సర్ షీట్లను మరోసారి మూల్యాంకనం చేయనున్నారు. అంతేకాదు ఒక సబ్జెక్టులో 33 మార్కులు వస్తే రీ వాల్యుయేషన్‌లో 36 మార్కులు వచ్చినట్టు ఓ ఎగ్జామినర్ తెలిపారు. దీనిని బట్టి చూస్తే రీ వాల్యుయేషన్ నిర్ణయంతో కొందరు విద్యార్థుల మార్కుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 25 వరకు ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాల్యుయేషన్ ప్రక్రియలో జరిగే ఈ విధమైన తప్పుల నివారణకే రీ వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని ఇంటర్ బోర్డు సీఓఈ జయప్రద బాయి తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




