వరంగల్ నిట్‌లో సీటు వచ్చినా.. రూ.4.59 లక్షల ఫీజు కట్టలేక పేదింటి బిడ్డ అవస్థలు!
ప్రభుత్వాలు మారినా.. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. పేదింట పుట్టిన బిడ్డల చదువులకు గడ్డు పరిస్థితులు మాత్రం మారడం లేదు. రకరకాల ఉచితాలు ఇచ్చే ప్రభుత్వం చదువు ఉచితం అని ఎందుకు ప్రకటించలేకపోతుందో తల పండిన నేతలకే తెలియాలి. ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులకు పేదరికం..

హుజూరాబాద్, జులై 10: కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఓ జంట తమ కుమారుడి ఉన్నత చదువులకు పేదరికం అడ్డంకిగా మారింది. కన్నోళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిన్ననాటి నుంచి ప్రభుత్వ బడిలోనే చదివినా.. కష్టపడి చదివి ప్రతిష్టాత్మక కాలేజీలో సీటు దక్కించుకున్నాడు. కానీ కాలేజీలో ఫీజు కట్టేందుకు వారి వద్ద కాసులు కరువయ్యాయి. అప్పు కూడా పుట్టే మార్గం లేకపోవడంతో ఆపన్నహస్తం కోసం రోడ్డెక్కారు. ఈ దీనగాథ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్‌కు చెందిన నీరటి రిషీ అనే విద్యార్ధిది.
నీరటి అశోక్, లలిత దంపతులకు ఇద్దరు కుమారులు. కూలీనాలీ చేసుకుంటూ బిడ్డలను కష్టపడి చదించారు. తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా పిల్లలు కూడా చదువులో బాగానే రాణించారు. నాలుగేళ్ల క్రితం పెద్దకుమారుడు ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. అప్పుడు కూడా ఫీజు కట్టలేక అవస్థలు పడ్డారు. చివరకు ఫీజులు తరువాత కట్టేలా కళాశాలలో ప్రత్యేక అనుమతులు తీసుకొని చదివిస్తున్నారు. ప్రస్తుతం చిన్నకుమారుడు రిషీ అల్గునూర్‌లోని రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని ఎస్సీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 941 మార్కులతో ఇంటర్ పాసయ్యాడు. ఈ ఏడాది జరిగిన జేఈఈ మెయిన్స్‌లో 96.98 పర్సంటైల్ సాధించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ 4,797 ర్యాంకుతో మెరిశాడు.
కౌన్సెలంగ్‌లో వరంగల్ నిట్‌లో ఈసీఈ (వీఎల్‌ఎస్‌ఐ) విభాగంలో సీటు కూడా దక్కింది. అయితే కాలేజీలో చేరాలంటే అన్నిరకాల ఫీజులు కలిపి తొలి ఏడాది రూ.1.48 లక్షలు కట్టాల్సి ఉంది. చెబుతున్నారు. మొత్తం నాలుగేళ్లకు రూ.4.59 లక్షలు ఫీజు కింద కట్టాల్సి ఉంది. పిల్లల ఉన్నత చదువులకు అంతేసి ఫీజులు కట్టే స్తోమత లేదని, దాతలు చేయూత అందించాలని రిషీ తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




