JEE Main 2026 Question Papers: జేఈఈ మెయిన్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో చూశారా..? టాప్ స్కోర్ సాధ్యమేనా..
JEE Main 2026 Question Paper 21 January Shift 1 Analysis: ఎన్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 పరీక్షలు బుధవారం (జనవరి 21) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 5 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు మొదటి షిఫ్ట్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో..

హైదరాబాద్, జనవరి 21: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 పరీక్షలు బుధవారం (జనవరి 21) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 5 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు మొదటి షిఫ్ట్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో జరిగింది. ఈ రోజు ఉదయం జరిగిన మొదటి సెషన్ పరీక్ష క్వశ్చన్ పేపర్ సులభం నుంచి మధ్యస్థంగా ఉన్నట్లు విద్యార్ధులు తెలిపారు. మ్యాథమెటిక్స్ ప్రశ్నలు మధ్యస్థం నుంచి కఠినంగా, ఫిజిక్స్ ప్రశ్నలు కూడా మధ్యస్థం నుంచి కఠినంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ప్రశ్నలు ఎక్కువగా ఫార్ములా ఆధారితంగా ఉన్నాయి. ఇక కెమిస్ట్రీలో ఈజీ నుంచి మధ్యస్థంగా వచ్చినట్లు విద్యార్ధులు తెలిపారు. ఇన్‌ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడిగారని తెలిపారు. మ్యాథమెటిక్స్ నుంచి అడిగిన కొన్ని ప్రశ్నలు కాస్త సమయం ఎక్కువగా తీసుకునేలా ఉన్నాయని వెల్లడించారు.
గతేడాది పరీక్షతో పోలిచ్చితే ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ప్రశ్నలు వచ్చినట్లు నిపుణులు అంటున్నారు. మొత్తంగా సెషన్ 1లో టాపర్స్ 300 మార్కులకు 290 మార్కుల వరకు తెచ్చుకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా విద్యార్థులు 120 నుంచి 150 వరకు సులభంగా స్కోర్ తెచ్చుకోవచ్చని నిపుణులు విశ్లేషించారు. మొత్తం మీద ఈ రోజు ఉదయం సెషన్‌లో జరిగిన పరీక్ష మధ్యస్థంగా ఉన్నట్లు విద్యార్ధులు చెబుతున్నారు.
కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటీగా పరీక్షల హడావుడి మొదలైంది. ఇందులో ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు, చివరి రోజయిన జనవరి 29న పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మలి సెషన్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. ఇక జేఈఈ మెయిన్స్‌కు ఈసారి దేశ వ్యాప్తంగా రికార్డుస్థాయిలో ఏకంగా 14.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




