AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిగ్రీ పరీక్షలో విద్యార్ధుల మాస్‌ కాపీయింగ్‌.. 93 ఆన్సర్ షీట్లు సీజ్! మూడేళ్లు డీబార్..

ఓవైపు పేపర్ లీకేజీలతో దేశం అట్టుడిగి పోతుంటే.. మరోవైపు విద్యావ్యవస్థలో ఎలాంటా మార్పు కనిపించడం లేదు. పరీక్షల సమయంలో ఇష్టారీతిన ఉపాధ్యాయులే దగ్గరుంచి మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం ఇస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జైసల్మేర్ జిల్లాలో పరీక్షల నిర్వహణలో తీవ్ర అక్రమాలు వెలుగుచూశాయి..

డిగ్రీ పరీక్షలో విద్యార్ధుల మాస్‌ కాపీయింగ్‌.. 93 ఆన్సర్ షీట్లు సీజ్! మూడేళ్లు డీబార్..
Rajasthan JNVU exam malpractice
Srilakshmi C
|

Updated on: Jul 24, 2026 | 7:49 AM

Share

డిగ్రీ రెండో సంవత్సరం పరీక్ష జరుగుతున్న సమయంలో ఇన్విజిలేటర్లే విద్యార్థులకు జవాబులు చెబుతున్న ఘటనను విశ్వవిద్యాలయ ఫ్లయింగ్ స్క్వాడ్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీ (JNVU) మొత్తం 93 ఆన్సర్ షీట్లను సీజ్ చేసి, సమగ్ర విచారణకు ఆదేశించింది. గత శనివారం (జులై 18) ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు జైసల్మేర్ జిల్లా కజోయి గ్రామంలోని శ్రీ కర్ణి కళాశాలలో బీఏ రెండో సంవత్సరం హిందీ సాహిత్య పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అమన్ సింగ్, సురేశ్ చౌదరి, లలిత్ ఝాలా, గౌరవ్ జైన్ సభ్యులుగా ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో ఇద్దరు ఇన్విజిలేటర్లు జై కరణ్, ఓం ప్రకాశ్ పరీక్ష హాల్లో విద్యార్థులకు నేరుగా జవాబులు చెబుతూ కనిపించారని అధికారులు తెలిపారు.

ఒకేలా సమాధానాలు.. 93 ఆన్సర్ షీట్లు సీజ్

విద్యార్థుల ఆన్సర్ షీట్లను పరిశీలించిన అధికారులు, పలువురు విద్యార్థులు దాదాపు ఒకే విధంగా సమాధానాలు రాసినట్లు గుర్తించారు. దీంతో పరీక్ష హాల్లోని మొత్తం 93 ఆన్సర్ షీట్లను సీజ్ చేసి, సామూహిక కాపీయింగ్ కేసు నమోదు చేశారు. పరీక్ష కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఇన్విజిలేటర్లు విద్యార్థులకు జవాబులు చెబుతున్న దృశ్యాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆధారాల ఆధారంగా పూర్తి స్థాయి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో అనుమానాస్పద పరిస్థితులు గుర్తించిన వెంటనే సంబంధిత విద్యార్థుల ఆన్సర్ షీట్లను స్వాధీనం చేసుకున్నామని జైసల్మేర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ శ్యామ్ సుందర్ మీనా చెప్పారు. అనంతరం పరీక్షను కొనసాగించేందుకు వారికి కొత్త ఆన్సర్ బుక్స్ అందించినట్లు తెలిపారు.

మూడేళ్ల వరకు డీబార్

యూనివర్సిటీ నిబంధనల ప్రకారం అక్రమ పద్ధతులకు పాల్పడినట్లు తేలితే విద్యార్థులను ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు పరీక్షల నుంచి డీబార్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే దీనిపై తుది నిర్ణయం యూనివర్సిటీ ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకోనున్నారు. పరీక్షల్లో అక్రమాల విషయంలో విశ్వవిద్యాలయం జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తోందని జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ పవన్ కుమార్ శర్మ చెప్పారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ఇదే ఫ్లయింగ్ స్క్వాడ్ జైసల్మేర్‌తో పాటు సమీపంలోని బార్మేర్ జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను కూడా తనిఖీ చేయగా, శివ్ పరీక్ష కేంద్రంలో మరో కాపీయింగ్ ఘటన వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Follow Us