TS Inter 2022 Exams: ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటించినా ఇంకా అందని స్టడీ మెటీరియల్..తెలుగు అకాడమీలో పేపర్ కొరత!
ముద్రణకు ఆర్డర్ ఇవ్వడంలో ఇంటర్ బోర్డు (TSBIE) జాప్యం, పేపర్ సమకూర్చుకోవడంలో తెలుగు అకాడమీ నిర్లక్ష్యం..
Intermediate Study material: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న దాదాపు 2 లక్షల మంది పేద ఇంటర్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందని పరిస్థితి నెలకొంది. ముద్రణకు ఆర్డర్ ఇవ్వడంలో ఇంటర్ బోర్డు (TSBIE) జాప్యం, పేపర్ సమకూర్చుకోవడంలో తెలుగు అకాడమీ నిర్లక్ష్యం ఇందుకు కారణాలనే విమర్శలు వినిపిస్తున్నాయి. బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ (Basic learning material)పేరిట గత విద్యా సంవత్సరం చివరలో అందుబాటులోకి తెచ్చిన పుస్తకాలను ఈ విద్యా సంవత్సరంలోనూ (తరగతుల జాప్యం నేపథ్యంలో) విద్యార్థులకు అందించాల్సి ఉండగా అధికారులు పట్టనట్లు వ్యవహరించారు. తీరికగా 20 రోజుల క్రితం ముద్రణకు తెలుగు అకాడమీకి ఆర్డరిచ్చారు. అకాడమీ వద్ద పేపర్ లేక మరో నెల రోజుల వరకూ ముద్రణకు అవకాశం లేకుండా పోయింది. అప్పటికి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితుల్లో మెటీరియల్‌ను ఇంటర్‌బోర్డు.. వెబ్‌సైట్లో పెట్టి చేతులు దులుపుకొంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలా మందికి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు లేవు. వారంతా ఆ మెటీరియల్‌ను ఇంటర్‌నెట్ కేంద్రాల్లో డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్లు తీసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థి రూ.200-300 చెల్లించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులందరిపై రూ.5 కోట్ల వరకూ భారం మోపినట్లైంది.
తెలుగు అకాడమీలో పేపర్ కొరత కరోనా కారణంగా గత విద్యా సంవత్సరం (2020-21లో) ప్రత్యక్ష తరగతులు ఫిబ్రవరిలో ప్రారంభమైనందున 70 శాతం సిలబస్ ఆధారంగా ఒక్కో ఇంటర్ గ్రూపునకు ఒక పుస్తకాన్ని బోర్డు రూపొందించింది. అందులో భాషా సబ్జెక్టులు మినహా మిగిలిన వాటిలో క్లుప్తంగా అన్ని అంశాలపై ప్రశ్నలు-సమాధానాలు పొందుపరిచారు. విద్యార్థులకు ఆ పుస్తకాలు అందిస్తే సులభంగా అర్థం చేసుకొని పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారనేది ఉద్దేశం. గత విద్యా సంవత్సరంలో పరీక్షలకు 13 రోజుల ముందు ఆ పుస్తకాలను ఆవిష్కరించారు. అప్పట్లో 20 శాతం మందికి మాత్రమే వాటిని అందించగలిగారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ మూడు నెలలు ఆలస్యంగా గత సెప్టెంబరులో తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సంవత్సరంలోనూ వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించిన అధికారులు.. ముద్రణపై ఇన్నాళ్లూ నిర్లక్ష్యంగా వ్యవహరించి.. పరీక్షల తేదీలు ప్రకటించాక తెలుగు అకాడమీకి ఆర్డర్ ఇచ్చారు. అకాడమీ వద్ద కాగితం లేకపోవడంతో ముద్రణ చేపట్టలేదు. రెండు రోజుల క్రితం కాగితం సేకరణకు టెండర్ ఖరారైందని, అది రావడానికి నెల రోజులు పడుతుందని చెబుతున్నారు. అంటే ఈ ఏడాదికి మెటీరియల్ పంపిణీ చేసే అవకాశం లేనట్టేనని తెలుస్తోంది.
Also Read: