నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఈ ఏడాది ముందుందిలే మంచికాలం
ఇండియాలోని వైట్ కాలర్ మార్కెట్ 2025 మొదటి భాగంలో బలంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. నౌకరి.కామ్ నిర్వహించిన హైరింగ్ అవుట్‌లుక్ సర్వే ప్రకారం 96 శాతం కంపెనీలు నియామకాలను పెంచే యోచనలో ఉన్నాయి. ఇది 2024లో 92 శాతం ఉండగా ఇప్పుడు మరింత పెరిగింది.

ఈ సర్వేలో 1,200కి పైగా కంపెనీలు పాల్గొని తమ నియామక ప్రణాళికలను తెలియజేశాయి. 58% కంపెనీలు కొత్త ఉద్యోగాలను సృష్టించడంతో పాటు.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. గత ఏడాది ఈ శాతం 48% మాత్రమే. మరో 18% కంపెనీలు పూర్తిగా కొత్త ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యం ఇస్తాయి. 20% కంపెనీలు భర్తీ చేయాల్సిన ఖాళీలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఉద్యోగులను తొలగించే ప్రణాళికలు తగ్గుముఖం పడుతున్నాయి. 2025లో 2% కంపెనీలు మాత్రమే ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నాయి. గత ఏడాది ఇది 3%.
2025లో ఐటీ రంగం నియామకాల్లో ముందంజలో ఉంటుంది. 37% కంపెనీలు ఐటీ ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇది 2024లో 24% మాత్రమే. ఐటీ ఉద్యోగాల్లో 42% కంపెనీలు అధిక ఉద్యోగ మార్పు (అట్రిషన్) ఉంటుందని భావిస్తున్నాయి.
3-8 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎక్కువ డిమాండ్ లో ఉంటారు. 58% నియామకాలు ఈ అనుభవం గల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి, గతేడాది ఇది 53% మాత్రమే.
ఉద్యోగులను ఆకర్షించేందుకు, నిలుపుకోవడానికి కంపెనీలు వేతనాలను పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. 54% కంపెనీలు 10%కంటే ఎక్కువ వేతన పెంపు ఇవ్వనున్నాయి. 39% కంపెనీలు 5-10% వేతన పెంపు ఇవ్వాలని భావిస్తున్నాయి.
కొత్తగా గ్రాడ్యుయేట్ అయినవారికి ఉత్తమ అవకాశాలు లభించనున్నాయి. 34% కంపెనీలు క్యాంపస్ నియామకాలను కొనసాగిస్తామని ప్రకటించాయి. ఇది 2024లో 30% మాత్రమే.
ఉద్యోగాలపై సానుకూల ధోరణి ఉన్నప్పటికీ.. కొన్ని సవాళ్లు ఉన్నాయి. 25% కంపెనీలు సరైన టాలెంట్ దొరకడం కష్టం అని చెబుతున్నాయి. 27% కంపెనీలు బడ్జెట్ పరిమితుల వల్ల నియామకాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 22% కంపెనీలు అభ్యర్థులు అవసరమైన నైపుణ్యాలకు సరిపోరని భావిస్తున్నాయి.
2025లో ఉద్యోగ మార్పు పెరిగే సూచనలు ఉన్నాయి. 5% కంటే తక్కువ ఉద్యోగ మార్పును ఊహిస్తున్న కంపెనీలు 23% నుంచి 17%కి తగ్గాయి. 5-10% ఉద్యోగ మార్పు ఉంటుందని భావిస్తున్న కంపెనీలు 34%.
3-5 సంవత్సరాల అనుభవం గల ఉద్యోగులు (33%) ఎక్కువగా కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్నారు. 1-3 సంవత్సరాల అనుభవం గల ఉద్యోగులు (26%) ఉద్యోగ మార్పు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
2025లో భారతీయ ఉద్యోగ మార్కెట్ మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అధిక సంఖ్యలో ఉద్యోగాలు, మంచి వేతనాలు, కొత్త నియామక విధానాలు ఉద్యోగ మార్కెట్‌ను మరింత బలపరిచే అవకాశముంది.




