JEE Advanced 2026 Exam Date: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?
JEE Advanced 2026 Exam date: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రకటించింది. ఇప్పటికే జేఈఈ మెయిన్ రెండు విడతల షెడ్యూలన్‌లను ప్రకటించిన ఎన్టీయే ఈ మేరకు అడ్వాన్స్‌డ్ తేదీని కూడా ప్రకటించింది. జేఈఈ మెయిన్ 2026 తొలి విడతలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ముగిసిన సంగతి..

హైదరాబాద్, డిసెంబర్ 7: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రకటించింది. ఇప్పటికే జేఈఈ మెయిన్ రెండు విడతల షెడ్యూలన్‌లను ప్రకటించిన ఎన్టీయే ఈ మేరకు అడ్వాన్స్‌డ్ తేదీని కూడా ప్రకటించింది. జేఈఈ మెయిన్ 2026 తొలి విడతలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ముగిసిన సంగతి తెలిసిందే.
ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ అప్లికేషన్‌లో పొరబాట్లను సవరించుకోవడానికి డిసెంబర్ 1 నుంచి 2వ తేదీ రాత్రి 11.50 వరకు అవకాశం కల్పించింది. జనవరి 21 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో తెలిపింది. ఈ రెండు విడతల్లో ప్రతిభకనబరచిన తొలి 2.5 లక్షల మందిని మాత్రమే అడ్వాన్స్‌డ్ రాసేందుకు అనుమతిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 రాత పరీక్ష ఈసారి మే 17న జరగనుంది. దేశంలోని 23 ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతను ఐఐటీ రూర్కీ చేపట్టింది. ఈ మేరకు ఆ విద్యాసంస్థ డిసెంబరు 5న వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ఐఐటీల్లో ప్రస్తుతం 18,160 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




