Inspiration Story: యూపీఎస్సీలో సత్తా చాటిన TV రిపేర్‌మ్యాన్ కొడుకు.. తొలి ప్రయత్నంలోనే ఎంపిక!
ఈ ఏడాది విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో.. టీవీలు రిపేర్ చేసే ఓ సాధారణ ఎలక్ట్రీషియన్ కొడుకు ఏకంగా యూపీఎస్సీ ఆల్ ఇండియా 423 ర్యాంకు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. అతి చిన్న వయసులోనే తొలి ప్రయత్నంలోనే విజయం దక్కించుకున్న అతడి గురించి మీరు తప్పక తెలుసుకోవాలి..

దేశ వ్యాప్తంగా నిర్వహించే అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎంపిక పరీక్ష ఒకటి. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థాయి కొలువులు దక్కించుకోవాలంటే విపరీతమైన పోటీతోపాటు నియామక పరీక్ష కూడా ఎంతో కఠినంగా ఉంటుంది. ఈ పరీక్షకు సన్నద్ధమయ్యే వారి నేపథ్యాలు భిన్నంగా ఉన్నప్పటికీ పట్టుదల, అవిరామ కృషి, సాధించాలనే తపన, మొండివైఖరి వారిని విజేతలుగా నిలుపుతుంది. ఈ ఏడాది విడుదలైన యూపీఎస్సీ ఫలితాలు చూస్తే ఈ విషయం అవగతమవుతుంది. టీవీలు రిపేర్ చేసే ఓ సాధారణ ఎలక్ట్రీషియన్ కొడుకు ఏకంగా యూపీఎస్సీ ఆల్ ఇండియా 423 ర్యాంకు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలోని కొంచ్ నగర్‌కు చెందిన టీవీ రిపేర్ కుమారుడు 24 ఏళ్ల అశ్వని శుక్లా గురించే మనం చర్చిస్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో అతడు 423వ ర్యాంకు సాధించాడు.
మరో ప్రత్యేకత ఏమిటంటే అశ్వని తన తొలి ప్రయత్నంలోనే ఈ విజయాన్ని సాధించాడు. అశ్వని విజయంతో అతని కుటుంబం మాత్రమే కాదు మొత్తం కొంచ్ నగరం ఈ విజయాన్ని గర్వంగా భావించింది. అశ్వని శుక్లా అతి సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి దివిష్ చంద్ర శు.. కొంచ్‌లో టీవీ రిపేర్‌మెన్‌గా పనిచేస్తున్నారు. తల్లి శశి శుక్లా గృహిణి. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ.. అవి ఏనాడు అశ్వని చదువుకు అడ్డుకాలేదు. అశ్వని ఎస్ఎన్ గుప్తా పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కెజి నుంచి 2వ తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత ఒరైలోని వీరేంద్ర సింగ్ బఘేల్ పబ్లిక్ స్కూల్‌లో 3 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తరువాత అతను లక్నోలోని ప్రతిష్టాత్మక సైనిక్ స్కూల్‌లో ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఎంపికయ్యాడు. అక్కడ క్రమశిక్షణ, నాయకత్వం, అంకితభావం వంటి లక్షణాలను నేర్చుకున్నాడు. అశ్వని 2017లో హైస్కూల్, 2019లో ఇంటర్మీడియట్ అక్కడే పూర్తి చేశాడు.
2019 లో అశ్విని దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా పరిగణించబడే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) కి ఎంపికైనాడు. కానీ వైద్య పరీక్ష సమయంలో కంటి చూపు సరిగా లేకపోవడం వల్ల వెనుదిరిగాడు. ఈ వైఫల్యం అతన్ని కుంగదీయలేదు. బదులుగా మరో కొత్త మార్గాన్ని ఎంచుకుని అంకితభావంతో UPSC వైపు అడుగులు వేశాడు. అశ్విని 2022లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి భౌగోళిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అక్కడే ఉంటూ UPSCకి సిద్ధమవడం ప్రారంభించాడు.
సోషల్ మీడియాకు దూరంగా ఉండి, క్రమం తప్పకుండా చదువుకునే అలవాటును పెంచుకున్నాడు. వార్తాపత్రికలు చదవడం తన దినచర్యలో భాగంగా చేసుకున్నాడు. ప్రస్తుత అంశాలపై లోతైన పట్టు సాధించాడు. చదువును లక్ష్యంగా చేసుకుని కష్టపడి పనిచేస్తే, ఏ పరీక్ష కూడా కష్టం కాదు. దృఢ సంకల్పం ముందు పరిస్థితులు కూడా అడ్డంకిగా మారవు అనేది అశ్విని బలంగా నమ్ముతాడు. ఆ నమ్మకంతోనే 2024లో యూపీఎస్సీ పరీక్షలు రాశాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో అతడు 423వ ర్యాంకు సాధించాడు. కుమారుడు సాధించిన ఘనతకు అశ్విని తండ్రి దివిష్ చంద్ర శుక్లా భావోద్వేగానికి గురైయ్యారు. ‘నా కొడుకు ఇంత ఎత్తుకు చేరుకుంటాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను టీవీ రిపేర్ చేసేవాడిని. కానీ అది పిల్లల చదువులకు ఆటంకం కలిగించనివ్వలేదు. ఈరోజు నా కొడుకు దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. మేము అతడు చదువుకోవడానికి అవకాశం ఇచ్చాం. మిగతా అంతా తనే స్వయంగా సాధించాడు’ అని గర్వంగా చెప్పారు. తల్లి శశి శుక్లా మాట్లాడుతూ.. పిల్లల చదువే తనకు అతిపెద్ద ఆస్తి అని చెప్పారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.