
హైదరాబాద్, డిసెంబర్ 18: దేశవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిష్ఠాత్మక లా యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిసెంబరు 7న కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్-2026) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం (CNLU) డిసెంబరు 16న విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 92,344 మంది క్లాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 96.83 శాతం మంది అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు, 92.45% మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఉన్నారు. ఇందులో 94 శాతం మంది పరీక్ష రాశారు. హైదరాబాద్ నుంచి యూజీలో ఆరుగురు, పీజీలో ముగ్గురు అభ్యర్థులు 100లోపు ర్యాంకులు సాధించారు. క్లాట్ యూజీలో బెంగళూరు నుంచి 15 మంది అత్యధిక ర్యాంకులు పొందారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఎనిమిది మంది, ముంబయిలో ఏడుగురు ఉన్నారు. టాపర్స్ లిస్టులో హైదరాబాద్ నాలుగోస్థానంలో నిలిచింది. యూజీలో రాజమహేంద్రవరం, విశాఖపట్నం నుంచి ఒక్కొక్కరు టాప్ 100లో ర్యాంకు సాధించారు.
క్లాట్ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2026 పీజీ ప్రవేశాల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి చెందిన వేమిరెడ్డి నితిన్ చంద్ర జాతీయ స్థాయిలో 90వ ర్యాంక్ సాధించారు. ఈ పరీక్షలో మొత్తం 83.50 మార్కులు సాధించి ఓబీసీ కేటగిరీలో ఆల్ ఇండియా 5వ ర్యాంక్‌లో మెరిశారు. ఆంధ్రప్రదేశ్ జనరల్ కేటగిరీలో తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించడం విశేషం. స్వేతాచలపతి సంస్థాన ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన నితిన్ చంద్ర విశాఖపట్నంలోని వెనిక్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఏపీ లాసెట్‌లో 14వ ర్యాంక్ సాధించి ఆంధ్రా యూనివర్సిటీలో బీఏ ఎల్‌ఎల్‌బీలో ప్రవేశం పొందారు. తాజాగా క్లాట్ 2026 పీజీలోనూ ర్యాంకు కొట్టి అందరి దృష్టి ఆకర్షించారు.
మరన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.